Telugu Gateway
Andhra Pradesh

‘బ్రిక్స్....బాండ్స్’ అంటూ అమరావతితో చంద్రబాబు ఆటలు

‘బ్రిక్స్....బాండ్స్’ అంటూ అమరావతితో చంద్రబాబు ఆటలు
X

అప్పుడు ‘మై బ్రిక్ ..మై అమరావతి అన్నారు. ఇప్పుడు బాండ్లు అంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొత్త పాట అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్న నూతన రాజధాని ‘అమరావతి’తో చంద్రబాబునాయడు ‘ఆటలు’ ఆడుతున్నారు. రాజధాని ప్రకటించిన తొలి రోజుల్లోనే ఎన్ఆర్ఐలతోపాటు తెలుగు ప్రజలందరినీ ఇందులో భాగస్వాములను చేసేందుకు ‘ మై బ్రిక్ మై అమరావతి’ అంటూ ఓ హంగామా ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమం ద్వారా ఎంత మొత్తంలో వచ్చాయో ఎవరికీ తెలియదు. ఆ తర్వాత పవిత్ర జలాలు...మట్టినీళ్ళు అంటూ మరో ఈవెంట్ చేశారు. అవన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టి ఉంచేశారు. నాలుగేళ్ళు కావస్తోంది. కానీ అసలు రాజధాని అడుగు ముందుకు పడలేదు. ఇప్పుడు కొత్తగా రాజధాని నిర్మాణానికి అంటూ ప్రజలకు మళ్ళీ కొత్త పిలుపునిచ్చారు. అమరావతి నిర్మాణానికి బాండ్లు జారీ చేస్తామని ప్రకటించారు. బ్యాంకులు ఇఛ్చే వడ్డీ కంటే తాము అధికంగా ఇస్తామని ఎన్ఆర్ఐలతోపాటు..అందరూ ఇందులో పెట్టుబడి పెట్టాలని కోరుతున్నారు. అంటే బాండ్లకు స్పందన వస్తే తప్ప రాజధాని పూర్తి కాదా?.

ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా?. రాజధాని నిర్మాణం కోసం అంటూ కేంద్రం ఇచ్చిన 1500 కోట్ల రూపాయలను వేరేవాటికి మళ్ళించారు. అంటే 1500 కోట్ల రూపాయలతోనే రాజధాని పూర్తవుతుందని కాదు. దేశంలో ఎక్కడాలేని విధంగా రైతులు ముందుకొచ్చి 33 వేల ఎకరాలు రాజధాని కోసం పూలింగ్ లో ఇచ్చేశారు. వాస్తవంగా మాట్లాడితే స్థలం కొత్తగా కొనాల్సిన అవసరం లేదు కాబట్టి..1500 కోట్ల రూపాయలతో అసెంబ్లీ, సచివాలయం, రాజ్ భవన్ వంటి నిర్మాణాలను అద్బుతంగా పూర్తి చేయవచ్చని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. మౌలికసదుపాయాలు ప్రభుత్వ ఖర్చుతో సమకూర్చుకుంటే ఇఫ్పటికే రాజధాని పూర్తయ్యేదని ఆయన వ్యాఖ్యానించారు.

రాజధాని అంటే సహజంగా సచివాలయం, అసెంబ్లీ, రాజ్ భవన్, హైకోర్టు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిలభారత సర్వీసు అధికారుల నివాసాలు ఉంటాయి. వీటితోపాటు ప్రభుత్వ ఉద్యోగుల నివాసాలు ఉంటాయి. వీటికి అయ్యే వ్యయం ఎంత ఉంటందో లెక్కించి కేంద్రాన్ని అడగాలి. అంతే కానీ..తాము రాజధానిని 50 వేల ఎకరాల్లో నిర్మిస్తాం..ఈ మొత్తం ఖర్చు అంతా కేంద్రం భరించాలంటే ఎవరు ముందుకొస్తారని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. చంద్రబాబు తాజా వైఖరి చూస్తుంటే కేంద్రం మోసం చేసింది కాబట్టి రాజధాని కట్టలేకపోయామని..ప్రజల సెంటిమెంట్ తో ఆడుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కన్పిస్తోంది. కేవలం చంద్రబాబు తీరు కారణంగానే రాజధానికి భూములిచ్చిన రైతులతోపాటు...రాజధానిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రజలు నిరాశకు గురి కావల్సి వస్తోంది. అయితే సంక్షోభాలను అవకాశంగా మలుచుకుంటాననే చంద్రబాబు...తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఓ స్కామ్ గా మార్చే ప్రయత్నం చేస్తున్నారని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

Next Story
Share it