భయం...భయంగా చంద్రబాబు!
‘మాకు ఎవరిపై కోపం లేదు.. ద్వేషం లేదు. ఇవ్వాల్సినవే అడుగుతున్నాం’. ఇవీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా చేసిన ‘బేల’ వ్యాఖ్యలు. ఏపీకి ఇస్తామన్న ప్రత్యేక హోదా ఇవ్వనప్పుడు , రైల్వే జోన్ ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయనప్పుడు ఎందుకు కోపం ఉండదు. ఏపీ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు అంటారు. మరి చంద్రబాబు ఆగ్రహంగా లేనట్లా?. ఆయన తన పని తాను చేసుకుంటూ హ్యాపీగా ఉన్నారా?. అసలు నిన్న మొన్నటివరకూ ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించకుండా ఏపీ ప్రజలను వంచించింది చంద్రబాబు కాదా?. లెక్క రెవెన్యూ లోటు ఇవ్వనందుకు కేంద్రంపై కోపం లేక..ప్రేమ ఉందా?. కొన్నిసార్లు అసలే కష్టాల్లో ఉన్న రాష్ట్రం కేంద్రం సాయం లేకుండా ముందుకు సాగలేదు అంటారు. ఇప్పుడు మాత్రం కేంద్రం అండ లేకుండా మనగలుగుతున్న రాష్ట్రాలు లేవా?. విజయాలు సాధిస్తున్న వారు లేరా? అంటున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎందుకింత భయం భయంగా వ్యవహరిస్తున్నారో అర్థం కావటంలేదని టీడీపీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. ఎన్టీఆర్ తెలుగు ఆత్మగౌరవాన్ని ఉన్నత స్థానానికి తీసుకెళితే...చంద్రబాబు ఎందుకు వెన్నెముక లేకుండా వ్యవహరిస్తున్నారని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు జరిగిన తెలుగుదేశం శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు అందరూ ముక్తకంఠంతో బిజెపితో పొత్తు తెంచుకోవాలని సూచించారు. ఓ ఆరుగురు మినహా అందరిదీ అదే అభిప్రాయం.అయినా చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు.
స్వయంగా చంద్రబాబే కేసుల గురించి ప్రస్తావిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వటం సాధ్యంకాదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టమైన సంకేతాలు ఇఛ్చింది. అయినా కూడా కేంద్రంలో టీడీపీ మంత్రులను ఎందుకు రాజీనామా చేయమని అడగటంలేదో అర్థం కావటంలేదని టీడీపీ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. టీడీఎల్పీ సమావేశంలో అసెంబ్లీలో కీలక ప్రకటన చేస్తానని చెప్పిన చంద్రబాబు మళ్లీ అదే పాత క్యాసెట్ వేశారు. ఓ వైపు పలు ప్రాజెక్టుల్లో ఐఏఎస్ అధికారులు చేసిన సిఫారసులను కూడా పక్కన పడేసి అడ్డగోలు అవినీతికి పాల్పడుతూ మళ్లీ ‘నిప్పు’ మాటలు మాట్లాడి అందరినీ నివ్వెరపర్చేలా చేస్తున్నారు చంద్రబాబు. కేంద్రం నుంచి మంత్రులను ఉపసంహరింపచేస్తే ప్రభుత్వంలోని కీలక వ్యక్తులపై కేసులు పడటం ఖాయమని...ఇప్పటికే దర్యాప్తు సంస్థలు అన్ని వివరాలు సిద్దం చేసి పెట్టుకున్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. చంద్రబాబు ప్రభుత్వంలో పాల్పడుతున్న అవినీతికి సంబంధించిన అన్ని నివేదికలు కొంత మంది ఐఏఎస్ అధికారులు ఇఫ్పటికే కేంద్రం చేతికి చేరవేశారు. అయితే వీటిపై మోడీ ఎలా ముందుకు సాగుతారు అన్నదే ఇప్పుడు కీలకంగా మారనుంది.