Telugu Gateway
Andhra Pradesh

జాతీయస్థాయిలో చంద్రబాబు ‘అవినీతిపై చర్చ’

జాతీయస్థాయిలో చంద్రబాబు ‘అవినీతిపై చర్చ’
X

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఒకప్పుడు జాతీయ స్థాయిలో ఓ రకమైన ఇమేజ్ ఉండేది. సంస్కరణవాదిగా పేరుండేది. దీనికి తోడు జాతీయ స్థాయిలో ఒకప్పుడు రాజకీయంగా కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అదంతా గతం. ఈ సారి జాతీయ స్థాయిలో చంద్రబాబు ఇమేజ్ దారుణంగా పడిపోయిందని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ముఖ్యంగా అధికార వర్గాల్లో ఏపీలోని చంద్రబాబు సర్కారులో సాగుతున్న అవినీతిపై విస్తృతంగా చర్చ సాగుతోంది. ఇప్పుడు ఢిల్లీలోని అధికార వర్గాల్లో ఏపీలోని అవినీతిపైనే విస్తృత చర్చ సాగుతోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా కేంద్రంలోని ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చిన తర్వాత ఈ చర్చ మరింత ఎక్కువైందని చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఏపీ నుంచి ఢిల్లీ వెళ్ళిన కొంత మంది అధికారులు చెప్పిన వివరాలే ప్రధానంగా ఉన్నాయి. దీంతో పాటు కొంత మంది టీడీపీ ఎంపీలు కూడా చంద్రబాబు సర్కారులో సాగుతున్న అవినీతి వ్యవహారాలను ఢిల్లీలో పూసగుచ్చినట్లు వివరిస్తున్నారు. దీంతో ఇప్పుడు చంద్రబాబు సర్కారు అవినీతి అక్కడ ఓ పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఏపీలోని ఓ కీలక శాఖలో ఉన్న ఐఏఎస్ అధికారికి తన సొంత రాష్ట్రంలో కాంట్రాక్టర్లే ఖరీదైన, విలాసవంతమైన ఇంటిని నిర్మించి ఇచ్చారు.

ఇది ఇప్పుడు అధికార, పారిశ్రామిక వర్గాల్లోనూ పెద్ద చర్చనీయాంశంగా ఉంది. స్విస్ ఛాలెంజ్ విధానంలో సింగపూర్ కంపెనీల కోసం ఏపీ సర్కారు చట్టాలతో ఎలా చెడుగుడు ఆడిందో అందరూ చూశారు. అందులో ఏ మాత్రం అవినీతి లేకపోతే ప్రైవేట్ సంస్థల కోసం సర్కారు అంతగా సాగిలపడాల్సిన అవసరం ఏముందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఇప్పటికే కేంద్రం కీలకస్థానాల్లో ఉన్న కొంత మంది ఐఏఎస్ లకు సంబంధించిన అక్రమాల వ్యవహారాలను దగ్గర పెట్టుకుని అనువైన సమయం కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు, నారా లోకేష్ ల అవినీతిని బిజెపి నేతలు ప్రశ్నించగా..చంద్రబాబు అమిత్ షా తనయుడి అవినీతి గురించి ప్రస్తావించటం మొదలుపెట్టారు.

అమిత్ షా తనయుడి వ్యవహారం వెలుగులోకి వచ్చి కొన్ని నెలలు అయిన విషయం తెలిసిందే. అప్పట్లో దీనిపై నోరెత్తకుండా ఉన్న చంద్రబాబు...కేవలం తనపైనా, లోకేష్ పైనా ఆరోపణలు చేయగానే అమిత్ షా తనయుడి అవినీతి గురించి మాట్లాడటం మొదలుపెట్టేశారు. పైగా చంద్రబాబు గుజరాత్ రాజ్యసభ ఎన్నికల సమయంలో అమిత్ షా వ్యవహరించిన తీరుపైనా ఇఫ్పుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పట్లో చంద్రబాబు ఇదే అమిత్ షా అధ్యక్షుడిగా ఉన్న బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు. అప్పుడు కనీసం నోరెత్తి మాట్లాడని చంద్రబాబు..తన అవినీతి అంశాలను ప్రస్తావించగానే...అమిత్ షా అవినీతి, అక్రమాలు గుర్తుకొచ్చాయి. బిజెపి నేతలదీ అదే పరిస్థితి. టీడీపీ ప్రభుత్వం నుంచి బయటకు పోగానే ప్రభుత్వ అవినీతిపై ఎటాక్ మొదలుపెట్టారు. అంటే దొందూ దొందే అన్న తీరుగా ఉంది ఆయా పార్టీల తీరు. మోడీ సర్కారుపై పెద్దగా అవినీతి ఆరోపణలు లేవు కానీ...ఈ విషయంలో చంద్రబాబు సర్కారుదే ‘రికార్డు’గా నిలవబోతోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

Next Story
Share it