Telugu Gateway
Andhra Pradesh

కోర్టులనూ శాసిస్తానంటున్న చంద్రబాబు

కోర్టులనూ శాసిస్తానంటున్న చంద్రబాబు
X

‘మా ఇష్టం వచ్చినట్లు చేస్తాం. కోరిన పరిశ్రమలకు కోరినట్లు భూములు ఇస్తాం. అడ్డగోలుగా రాయితీలు ఇస్తాం. అంతా ‘మంచి ఉద్దేశం’తోనే చేస్తాం. అందుకే ఎవరూ మా నిర్ణయాలను సవాల్ చేయకూడదు. కోర్టు కూడా ఇలాంటి కేసులను పరిగణనలోకి తీసుకోకూడదు.’ ఇదీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి సర్కారు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఓ బిల్లులోని కీలక సారాంశం. అసలు కోర్టులను డైరక్ట్ చేసే అధికారం ప్రభుత్వాలకు...అసెంబ్లీలకు ఉంటుందా?. ఉంటే ఇక్కడ అసలు కోర్టులు పనిచేయగలవా?. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి తీరు చూసి అధికార వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఏపీ సర్కారు కొత్తగా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డుకు సంబంధించిన బిల్లులో విస్మయం కలిగించే అంశాలు అనేకం ఉన్నాయి. ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డు తీసుకునే నిర్ణయాలపై ప్రాసిక్యూషన్, లీగల్ ప్రొసీడింగ్స్ తో ముందుకెళ్ళటానికి వీల్లేదు.

అంతే కాదు..బోర్డుకు చెందిన అధికారి, ఉద్యోగులు, కన్సల్టెంట్ లపై కూడా చర్యలు తీసుకోవటానికి వీల్లేదట. ఈ మేరకు ఏపీ ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డు కు రక్షణ కల్పిస్తూ అపరిమిత అధికారాలతో బిల్లును అసెంబ్లీ ముందు పెట్టారు. బోర్డుకు వచ్చే ఆదాయం అంతా ప్రభుత్వానికే చెందుతుందని పేర్కొన్నారు. అయితే బోర్డులో ఉండే వారు ఎవరైనా తమ పర్యటనలు, వేతనాల చెల్లింపులు, కొత్త ఆఫీసుల ప్రారంభం, నిర్వాహణ, ఇతర ఖర్చుల కు సొంతంగా వాడుకోవచ్చని..దీనికి ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదంట. ఈడీబీకి చెందిన అధికారులు/ప్రతినిధులు రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సాహించటంతోపాటు ఇతర రాష్ట్రాలతోపాటు-దేశాలతోనూ వాణిజ్య సంబంధాలు నిర్వహిస్తారట. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి తీసుకున్న నిర్ణయాలను ప్రభుత్వంలోని ఉన్నతాధికారులే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

అలాంటప్పుడు ఒక బోర్డు ‘మంచి ఉద్దేశం’తో నిర్ణయం తీసుకుంటుందని..దాన్ని ఎవరూ ప్రశ్నించటానికి వీల్లేదంటూ ఏకంగా అసెంబ్లీలో బిల్లు పెట్టడానికి చంద్రబాబు రెడీ అయిపోయారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు. చంద్రబాబు మంచి ఉద్దేశంతో నిర్ణయాలు తీసుకుంటే అధికారులు ఎందుకు అడ్డుకుంటారు?.. వారు అభివృద్ధి వ్యతిరేకులా?. ఈడీబీలో ఉండే వారు మాత్రమే మంచిగా పనిచేస్తారా?. ఇది ఐఏఎస్ లను అవమానించటం కాదా?. ఈ బిల్లు బిజినెస్ రూల్స్ కు వ్యతిరేకంగా ఉందని..ఇది సరికాదని ఆర్థిక, న్యాయ శాఖలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అయినా సరే..కేబినెట్ తో ఓకే చేయించి..బిల్లును సభ ముందుకు తీసుకొచ్చారు. పలు కీలక శాఖలను బైపాస్ చేసి..ఈడీబీ ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు ఇందులో కల్పించారు.

Next Story
Share it