Telugu Gateway
Andhra Pradesh

కేంద్రం నుంచి టీడీపీ మంత్రులు బయటకు

కేంద్రం నుంచి టీడీపీ మంత్రులు బయటకు
X

సస్పెన్స్ కు తెరపడింది. కేంద్ర మంత్రివర్గం నుంచి వైదొలగాలని భాగస్వామ్య పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. దీంతో కేంద్ర మంత్రులుగా ఉన్న అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరిలు గురువారం నాడు తమ పదవులకు రాజీనామా చేయనున్నారు. దీంతో మరోసారి ఎన్డీయే మంత్రివర్గం నుంచి టీడీపీ తప్పుకున్నట్లు అయింది. కేంద్రం ఎప్పటి నుంచో ప్రత్యేక హదా విషయంలో సానుకూలంగా లేకపోయినా..ఇఛ్చే అవకాశం లేదని స్పష్టం చేసినా ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్న తరుణంలో టీడీపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కన్పిస్తోంది. సాక్ష్యాత్తూ చంద్రబాబే ప్రత్యేక హోదాకు సమానంగా ప్యాకేజీ ఇస్తున్నారని..అందుకే అంగీకరించామని చెబుతూ వచ్చారు. తీరా ఇప్పుడు ప్రత్యేక హోదా ప్రజల్లోకి తీవ్రంగా పోవటం చంద్రబాబు తన స్టాండ్ మార్చారు. ఇంకా కేంద్ర మంత్రివర్గంలో కొనసాగితే రాజకీయంగా నష్టం అనే భావనతో చంద్రబాబు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. అందుకే బుధవారం రాత్రి విలేకరుల సమావేశం పెట్టి నిర్ణయాన్ని ప్రకటించారు. ఎన్డీయే కేబినేట్‌కు తెలుగుదేశం మంత్రులు రాజీనామా చేస్తారని ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేమని ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ తేల్చిచెప్పడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రాజీనామాల విషయాన్ని ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చెప్పేందుకు ఫోన్‌ చేసినట్లు వెల్లడించారు. అయితే, ఆయన అందుబాటులోకి రాలేదని చెప్పారు. తెలుగు ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేమని చెప్పి ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ అవమానించారని అన్నారు. ఎన్డీయే నుంచి పూర్తిగా ఇప్పుడే తప్పుకోవట్లేదని చెప్పారు. మొదటిగా కేంద్ర మంత్రులతో రాజీనామా చేయించి ఆంధ్ర ప్రజల ప్రతిఘటనను వారికి చెప్తామని అన్నారు. భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను బట్టి తర్వాతి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వాన్ని తామేమి గొంతెమ్మ కోర్కెలు కోరలేదని చెప్పారు. ఆర్థిక లోటుతో సతమతమవుతున్న రాష్ట్రానికి న్యాయం చేయమని కోరితే దేశ రక్షణకు వాడే డబ్బులు ఇమ్మన్నట్లు మాట్లాడారని వెల్లడించారు. ఇది సరైనది కాదన్నారు.

Next Story
Share it