Telugu Gateway
Andhra Pradesh

ప్రత్యేక హోదా కంటే చంద్రబాబు అవినీతే ప్రధాన సమస్య

ప్రత్యేక హోదా కంటే చంద్రబాబు అవినీతే ప్రధాన సమస్య
X

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని పక్కాగా ఫిక్స్ చేసే దిశగా బిజెపి అడుగులు వేస్తోంది. శనివారం ఉదయం నుంచి చకచకా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అంతా ప్లాన్ ప్రకారమే ముందుకు సాగుతున్నట్లు కన్పిస్తోంది. ఓ వైపు బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు చంద్రబాబునాయుడి సర్కారు అవినీతిని కళ్ళకుకట్టినట్లు బహిర్గతం చేయటమే కాకుండా...ప్రస్తుతం రాష్ట్రంలో హోదా కంటే...చంద్రబాబు అవినీతే ప్రధాన సమస్య అని వ్యాఖ్యనించి పెద్ద కలకలం రేపారు. ఈ సర్కారు అవినీతిపై పోరాటానికి ఎవరు వస్తారు...ఇప్పుడు ఓ ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని ప్రకటించారు. జయప్రకాష్ నారాయణ ముందుకొస్తారా?. లేక సీపీఐ రామకృష్ణ వస్తారా?. పవన్ కళ్యాణ్ వస్తారా? అని సోము వీర్రాజు ప్రశ్నించారు. తాము ఏదైనా మాట్లాడితే ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని మాట్లాడతారని..తాము పక్కా ఆధారాలతోనే మాట్లాడుతున్నామని స్పష్టం చేశారు. వీటి అన్నింటితో ప్రజా కోర్టుకు వెళతామని సోము వీర్రాజు తెలిపారు.

ఓ లారీ మట్టి తీసుకెళటానికి నాలుగు లక్షల రూపాయలా?. అంటే పది లారీలు తిప్పితే 40 లక్షల రూపాయలు వస్తాయి. ఓ గండి పూడ్చటానికి 11 కోట్లా?. నీరు, చెట్టుకు నాలుగు వేల కోట్లా?. భూ మాతను కూడా అమ్మేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు. దేశంలో ఎక్కడా కూడా ఏపీలో ఉన్నంత అవినీతి లేదు. చివరకు టాయిలెట్ల డబ్బు కూడా నాకేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లాలోనూ ఇదే జరుగుతోంది. ఇంత కంటే దారుణం ఉంటుందా?. చివరకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సబులిటీ (సీఎస్ఆర్) కింద చేసిన పనులకు కూడా టీడీపీ జన్మభూమి కమిటీలు బిల్లులు పెట్టి డబ్బులు స్వాహా చేశాయని ఆరోపించారు. ప్రతి టీడీపీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కంటే ఎక్కువగా వ్యవహరిస్తూ దోచుకుంటున్నారని ఆరోపించారు. అదే సమయంలో ప్రత్యేక హోదాపై సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉందని, అయితే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం అది సాధ్యమయ్యే అవకాశమేలేదన్నారు. మట్టి నుంచి ఇసుకదాకా, పోలవరం నుంచి పట్టిసీమ దాకా లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు.

అరుణ్‌ జైట్లీ సూచించినట్లు ‘స్పెషల్‌ పర్సస్ వెహికల్‌’ ఏర్పాటు చేస్తే.. హోదా హామీ ద్వారా ఏపీకి దక్కాల్సిన అన్నిటికి అన్ని మేళ్లూ అందుతాయని, ఈ విషయంలో బీజేపీపై ఎలాంటి అనుమానాలు అవసరంలేదని వీర్రాజు స్పష్టం చేశారు. అయితే అవినీతిలో కూరుకుపోయిన చంద్రబాబు మాత్రం అందుకు సుముఖంగా లేరని, తన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఆయన రాష్ట్రాన్ని బలిపెడుతున్నాడని పేర్కొన్నారు. ‘‘ఏపీ వరదాయిని పోలవరంతోపాటు పట్టిసీమ, రాయలసీమ ప్రాజెక్టులు అవినీతికి నిలయంగా మారాయని సోము వీర్రాజు తెలిపారు. ‘‘పట్టిసీమలో అవినీతి తవ్వడానికి గునపలు చాలవు. పట్టిసీమ 1125 కోట్ల నుంచి మొదలై 1667 కోట్లకు వెళ్ళింది.

24 పంపులు వేసి, 30 పంపులకు లెక్కలు కట్టారు. టెండర్లలో లేనివాటికి కోట్లు కుమ్మరించారు. మట్టి పేరుతో 67 కోట్లు నొక్కేశారు. జన్మభూమి కమిటీల పేరుతో ఒక్కో ఇంటికి రూ.20 వేలు వసూళ్లు చేస్తున్నారు. కొత్త పింఛన్ కు మూడు నెలల డబ్బులు ముందే తీసుకుంటున్నారు. చంద్రబాబు సర్కారు అవినీతి తోడటానికి ప్రొక్లెయినర్లు కూడా చాలవని వ్యాఖ్యానించారు. సోము వీర్రాజు. ఓ వైపు ఇదంతా సాగుతుండగానే బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పలు అంశాలతో చంద్రబాబుకు సుదీర్ఘమైన లేఖ రాశారు. ఎన్డీయే నుంచి టీడీపీ వైదొలగాలని తీసుకున్న నిర్ణయం పూర్తిగా రాజకీయపరమైనదే అన్నారు. ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. కేంద్రం ఇచ్చిన నిధులకు ఏపీ సర్కారు అసలు లెక్కలే ఇవ్వటంలేదని..ఇది ఏ మాత్రం సరికాదని అన్నారు. టీడీపీ ఎన్డీయే నుంచి తప్పుకున్నది అభివృద్ధి కోసం కాదని..రాజకీయం కోసమే అని పేర్కొన్నారు. తాము చేసింది అమిత్ షా తన సుదీర్ఘ లేఖలో ప్రస్తావించారు.

Next Story
Share it