Telugu Gateway
Andhra Pradesh

ఆ పార్టీ ‘మీడియా మేనేజ్ మెంట్’ బడ్జెట్ 200 కోట్లు!

ఆ పార్టీ ‘మీడియా మేనేజ్ మెంట్’ బడ్జెట్ 200 కోట్లు!
X

ఎన్నికలు అంటేనే నిధుల ప్రవాహం. అధికారిక లెక్కలకు అసలు లెక్కలకు ఏ మాత్రం పొంతన ఉండదు. అందులో తెలుగు రాష్ట్రాలు అంటే దేశంలోనే అత్యధికంగా ఎన్నికల ఖర్చు ఉండే ప్రాంతాలుగా గుర్తింపు ఉంది. ఎన్నికల ఖర్చులో కీలకపాత్ర పోషించేది మీడియా బడ్జెట్ కూడా. అయితే ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ ప్రధాన పార్టీ వచ్చే ఎన్నికల కోసం ఏకంగా 200 కోట్ల రూపాయల బడ్జెట్ ను కేటాయించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆ పార్టీ మీడియాను మేనేజ్ చేయటంలో దిట్ట. ఈ విషయం రాజకీయాలపై అవగాహన ఉన్న వారెవరికైనా తెలిసిన అంశమే. ఈ ఖర్చుకు సంబంధించి కూడా ఇప్పటికే బ్లూప్రింట్ కూడా సిద్ధం చేశారు. పత్రికలు..ఛానళ్లకు అధికారికంగా ఇచ్చేది కొంత. అనధికారికంగా అందజేసేది మరికొంత. ఇక రాబోయే రోజుల్లో అన్నీ స్కీమ్ ల ప్రకారమే వస్తాయి. ఇప్పటికే చాలా వరకూ మొదలైంది కూడా. ప్రత్యర్ధులపై లేని అంశాలు కూడా ఉన్నట్లు చూపి బురదజల్లే కార్యక్రమం ఇప్పటికే ఊపందుకుంది. రాబోయే రోజుల్లో ఇది మరింత పెరగటం ఖాయంగా కన్పిస్తోంది. ముందు టీవీల్లో వేయటం...ఆ తర్వాత అదే అంశాన్ని సోషల్ మీడియాలోకి తీసుకొచ్చి నడిపించేయటం. ఇలా కావాల్సినంత మేర ప్రత్యర్థులను డ్యామేజ్ చేయటం.

అంతిమంగా రాజకీయంగా లబ్దిపొందేందుకు ఇదే వాదనలను తెరపైకి తీసుకురావటం. ఈ రెండు వందల కోట్ల రూపాయల్లో సోషల్ మీడియాకు కూడా భారీ ఎత్తున బడ్జెట్ కేటాయించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మరి ఈ స్థాయి మేనేజ్ మెంట్ ను తట్టుకుని ఇతర పార్టీలు నిలబడగలవా?. అయితే ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పుడు ఏ స్థాయిలో మీడియా మేనేజ్ మెంట్ జరిగినా అది పెద్దగా ఫలితాన్ని ఇవ్వదని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. కలిసొచ్చే అంశాలు ఉన్నప్పుడు తటస్థులపై ప్రభావం చూపించటానికి అది ఒకింత దోహదం చేస్తుంది కానీ..అదే అంతిమ నిర్ణేతకాలేదని అన్నారు. అయితే ఈ విషయంలో ఆ పార్టీని తట్టుకుని నిలబడటం ఇతర పార్టీలకు ఏ మాత్రం సాధ్యంకాదని చెప్పొచ్చు.

Next Story
Share it