Telugu Gateway
Andhra Pradesh

ఉదయం రాజీనామా..సాయంత్రం ఆమోదం

ఉదయం రాజీనామా..సాయంత్రం ఆమోదం
X

ఉదయం రాజీనామా. సాయంత్రం ఆమోదం. ఏపీ మంత్రివర్గం నుంచి బిజెపి తప్పుకుంది. కేంద్ర మంత్రివర్గం నుంచి టీడీపీ తప్పుకుంది. టీడీపీ మంత్రుల కంటే బిజెపి మంత్రులే ముందు రాజీనామా చేశారు. అలాగే రాజీనామాల ఆమోదం కూడా అంతే వేగంగా జరిగిపోయింది. గురువారం ఉదయం కామినేని శ్రీనివాస్‌, మాణిక్యాలరావు లు ఏపీ కేబినెట్ నుంచి వైదొలగిన విషయం తెలిసిందే. వారిద్దరూ తమ రాజీనామా లేఖలను గురువారం ఉదయం అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి అందచేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో రాజీనామా చేస్తున్నట్టు వారు తెలిపారు.

బీజేపీ మంత్రుల రాజీనామాలు గవర్నర్ నరసింహన్ ఆమోదించినట్లు ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ వెల్లడించారు. మంత్రుల రాజీనామాలు గవర్నర్ అంగీకరించినట్లు సీఎం కార్యాలయానికి సమాచారం అందింది. 'ప్రధాని మోదీతో ఫోన్‌ సంభాషణలో సీఎం చంద్రబాబు పూర్తి వివరాలు తెలిపారు. మా డిమాండ్లపై కేంద్రం అవమానకరంగా వ్యవహరించడంపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు ఆంధ్రుల అందరి హక్కు. వీటిపై కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అవమానకరంగా వ్యాఖ్యానించారు. దీనిపై ఏపీ ప్రజలు అసహనంతో ఉన్నారని' పరకాల తెలిపారు.

Next Story
Share it