Telugu Gateway
Top Stories

బిజెపిని ఇరకాటంలోకి నెట్టిన అమిత్ షా

బిజెపిని ఇరకాటంలోకి నెట్టిన అమిత్ షా
X

బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షానే బిజెపిని ఇరకాటంలోకి నెట్టారు. అదీ అత్యంత కీలకమైన కర్ణాటక ఎన్నికల సమయంలో. ఆయన నోరుజారి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి పెద్ద అస్త్రాలుగా మారిపోయాయి. కాంగ్రెస్ దీనిపై కుషీకుషీగా ఉంట...బిజెపి మాత్రం బిక్కమొహం వేయాల్సి వచ్చింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. బీజేపీపై చేసిన ఆరోపణలను తిప్పి కొట్టే క్రమంలో షా మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా‘ఈ మధ్యే ఓ రిటైర్డ్‌ సుప్రీం కోర్టు జడ్జి దేశంలో పెరిగిపోయిన అవినీతి గురించి మాట్లాడారు. ఇప్పటిదాకా తాను గమనించిన ప్రభుత్వాల్లో యాడ్యూరప్ప ప్రభుత్వమే అత్యంత అవినీతిమయమైందని ఆయన తెలిపారు’ అంటూ అమిత్‌ షా చెప్పుకొచ్చారు. అయితే ఆ సమయంలో షా పక్కనే ఉన్న యడ్యూరప్ప ఆ మాటతో కంగుతున్నారు.

వెంటనే పక్కనే ఉన్న మరో నేత షా చెవిలో ఏదో చెప్పగా.. తాను పొరపాటున మాట్లాడిన విషయాన్ని గమనించి మరోసారి యాడ్యురప్ప కాదు.. సిద్ధరామయ్య అని షా సవరించుకున్నారు. అయితే ఆ వీడియో క్షణాల్లో బయటకు వచ్చేయటంతో కాంగ్రెస్‌ పార్టీ దానిని సోషల్ మీడియాలో వైరల్‌ చేయటం ప్రారంభించేసింది. సీఎం సిద్ధరామయ్య కూడా ఆ వీడియోను తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ‘షా చివరికి నిజం మాట్లాడారు’ అంటూ సందేశాన్ని ఉంచారు. మరోపక్క పలువురు ఆ కామెంట్లపై ట్రోల్‌ చేస్తున్నారు. కాగా, అవినీతి ఆరోపణలతో యాడ్యూరప్ప తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఈ వీడియోను షేర్ చేసి...ఈ ప్రచారం విజయవంతంగా ప్రారంభం అయిందని కామెంట్ చేశారు.

Next Story
Share it