Telugu Gateway
Politics

మార్చి21న వైసీపీ అవిశ్వాసం

మార్చి21న వైసీపీ అవిశ్వాసం
X

‘పవన్ మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా వైసీపీ వచ్చే 21న పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం పెడుతుంది. మద్దతు ఇచ్చి గెలిపించిన టీడీపీని..వదిలేసి వైసీపీని టార్గెట్ చేయటం వెనక పవన్ ఉద్దేశం ఏంటి?. జగన్ మీ సూచనను స్వీకరిస్తున్నాం. ఉద్దేశం ఏది అయినా?. మేం అవిశ్వాసానికి రెడీ. మీ భాగస్వామిని ఒప్పించండి’ అని మాత్రమే సూచించారు. కానీ జగన్ ఏదో సవాల్ చేసినట్లు..దాన్ని ఆయన స్వీకరించినట్లు మాట్లాడటం సరికాదని వైసీపీ నేత అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ఆయన మంగళవారం నాడు మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు. అవిశ్వాస తీర్మానం ఐదో తారీఖున పెట్టండి.. ఆరో తారీఖున పెట్టం‍డంటూ పవన్‌ చైల్డిష్‌గా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆయన వ్యాఖ్యలతో సంబంధం లేకుండా తమ పోరాటవ్యూహంలో భాగంగా ముందుకెళుతామని స్పష్టం చేశారు. మార్చి 5వ తేదీ నుంచి తమ పార్టీ ఎంపీలు పార్లమెంటులో ఆందోళనలు కొనసాగిస్తారని, మార్చి 21న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటులో అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టి తీరుతుందని, కేంద్రంపై తప్పకుండా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని తేల్చిచెప్పారు. ‘అవిశ్వాసం తలా, తోక లేనిదని, దాని వల్ల ప్రయోజనం ఉండదని చంద్రబాబు అంటున్నారు. అవిశ్వాసం తప్పు అని చంద్రబాబు చెప్తున్నా మీరెందుకు స్పందించడం లేదు.

ఎందుకు ఆయనను పల్లెత్తుమాట అనడం లేదు. పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన వెంటనే చర్చకు వస్తుంది. అలా చర్చకు రావాలంటే 50మంది ఎంపీల మద్దతు కావాలి. లేకపోతే.. అవిశ్వాసాన్ని తీసి పక్కన పెడతారు. కాబట్టి అవిశ్వాసానికి ముందే 50మంది ఎంపీల మద్దతు కూడగట్టాలి’ అని అంబటి అన్నారు. ‘పవన్‌ మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు కానీ.. చంద్రబాబును ప్రశ్నించడం లేదు. మా మీద ఆయనకు హక్కు లేదు. కానీ చంద్రబాబుపై ఉంది. బాబుకు ఓట్లు వేయమని చెప్పింది పవనే అన్న భావన ప్రజల్లో ఉంది. కేంద్రం హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినప్పుడు అది పుచ్చిపోయిన, పాచిపోయిన లడ్డూలని మీరు బీజేపీ తప్పుబట్టారు కానీ, చంద్రబాబుకు ఒక్క మాట అనలేదు. పాచిపోయిన లడ్డూలు అద్భుతంగా ఉన్నాయన్న చంద్రబాబును ప్రశ్నించలేదు’ అని పవన్‌ తీరును అంబటి తప్పుబట్టారు. చంద్రబాబుపై పవన్‌ ఎందుకు కామెంట్‌ చేయడం లేదని ప్రశ్నించారు. ఎక్కడో ఏదో జరుగుతుందన్న భావన ప్రజల్లో ఉందని, దీనిపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత పవన్‌పై ఉందని స్పష్టం చేశారు.

Next Story
Share it