Telugu Gateway
Politics

హోదా కోసం...వైసీపీ ఎంపీల రాజీనామాలు

హోదా కోసం...వైసీపీ ఎంపీల రాజీనామాలు
X

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేడిపుడుతోంది. గతంలో ఓ సారి రాజీనామాలు ప్రకటించి..వెనక్కి తగ్గిన వైసీపీ కొత్తగా మరోసారి ఎంపీల రాజీనామాల అస్త్రాన్ని తెరపైకి తెచ్చింది. ప్రత్యేక హోదా కోసం తమ ఎంపీలు ఏప్రిల్ 6న రాజీనామా చేస్తారని పాదయాత్ర చేస్తున్న జగన్ సంచలన ప్రకటన చేశారు. మార్చి 5 నుంచి జరగనున్న బడ్జెట్‌ సమావేశాల్లో హోదా కోసం తమ పార్టీ ఎంపీలు పోరాటం చేస్తారని తెలిపారు. ఏప్రిల్‌ 6 వరకూ పోరాటం చేసినా ఫలితం లేకపోతే పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని ప్రకటించారు. గత 12 రోజులుగా రాష్ట్రంలో జరగుతున్న డ్రామాను అందరూ గమనిస్తూనే ఉన్నారని జగన్ విమర్శించారు. బడ్జెట్‌ ప్రవేశపెట్టబోతున్నారన్న దగ్గర నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు డ్రామాకు తెర తీశారు. ఆయన డ్రామా ఏస్థాయిలో నడిచిందో మీ అందరికీ తెలుసు. కేంద్ర ప్రభుత్వంలో ఇద్దరు తెలుగుదేశం మంత్రులు ఉన్నారు. బడ్జెట్‌ను ప్రవేశపెట్టే ముందు కేంద్ర మంత్రులు అందరూ కలసి దాన్ని ఆమోదిస్తారు. ఆ సమయంలో అభ్యంతరం వ్యక్తం చేయకుండా బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత చంద్రబాబు నీచ రాజకీయాలు నడిపారు. ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరగుతుందని చంద్రబాబుకు ముందే తెలుసు. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత అన్ని రాష్ట్రాల కన్నా మనమే ఎక్కువ సాధించాం అని ప్రకటన ఇచ్చారు. ప్రత్యేక హోదా అన్నది ఆంధ్రుల హక్కు. లంచాలు, ప్యాకేజిల కోసం చంద్రబాబు దాన్ని కాదన్నాడు.

జూన్‌ 6, 2017న ప్యాకేజి కంటే ప్రత్యేక హోదా వల్ల జరిగే మేలేమిటి? అని సీఎం ప్రశ్నించారు. దేశంలో అందరి కంటే తానే సీనియర్‌ నేత అంటూ ప్రత్యేక హోదా వల్ల జరిగే నష్టం ఎక్కువని చెప్పాడు. ఆయన సీనియారిటీ హోదాను అమ్మేందుకు ఉపయోగపడింది తప్ప రాష్ట్ర ప్రయోజనానికి కాదు. వైఎస్‌ఆర్‌ సీపీ కి చెందిన ప్రతి ఒక్కరూ రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద మార్చి 1న ధర్నా నిర్వహిస్తారు. మార్చి 3న పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్లు పాదయాత్ర జరుగుతున్న ప్రదేశానికి వస్తారు. అక్కడి నుంచి నేను జెండా ఊపి వారిని ఢిల్లీకి పంపుతా. ప్రత్యేక హోదా మన హక్కు.. ప్రత్యేక ప్యాకేజి మాకొద్దు అనే నినాదంతో మార్చి 5న పార్లమెంటు వద్ద పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేస్తారు. ఏప్రిల్‌ 6 వరకూ హోదా కోసం పోరాటం చేస్తారు. ఫలితం లేకపోతే చివరి రోజైన ఏప్రిల్‌ 6న లోక్‌సభ స్థానాలకు రాజీనామా చేసి రాష్ట్రానికి తిరిగి వస్తారు. హోదా మన ఊపిరి దాని కోసం పార్టీ పోరాటం ఆగదు.’ అని జగన్ ప్రకటించారు. జగన్ తాజా ప్రకటనతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా మారాయి.

Next Story
Share it