Telugu Gateway
Politics

బిజెపిపై టీడీపీ వార్ డిక్లరేషన్..టీడీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

బిజెపిపై టీడీపీ వార్ డిక్లరేషన్..టీడీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
X

తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు టీ జీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత బలం చూసుకుని బిజెపి రెచ్చిపోతుందని..ఆ పార్టీ పొగరు దించుతామని అన్నారు. అంతే కాదు...తమ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుందో కూడా ఆయన ప్రకటించారు. ఓ వైపు అమరావతిలో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో పార్టీ నేతలతో సమావేశం అయిన సమయంలోనే ఆయన ఢిల్లీలో ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమికి చంద్రబాబు నాయకత్వం వహిస్తారని చెప్పారు. ‘చక్రం తిప్పడంలో సిద్ధహస్తుడైన చంద్రబాబునే బీజేపీ పట్టించుకోవడంలేదు. ఒంటరిగా మెజారిటీ సీట్లు ఉన్నాయన్న పొగరుతోనే బీజేపీ తన మిత్రులను లెక్కచేయడంలేదు. ఏపీలో టీడీపీది, మహారాష్ట్రలో శివసేనది అలాంటి పరిస్థితే. ఇప్పుడు బీజేపీ పొగరు దించాల్సిన అవసరం ఉంది. బాబును ఎప్పుడూ తక్కువ అంచనా వెయ్యొద్దు.

బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కూటమికి చంద్రబాబును మించిన నాయకులు లేరు. ప్రేమగా పనులు చేయించుకుందామన్న ఉద్దేశంతోనే ఇన్నాళ్లూ ఊరుకున్నాం. ఏపీకి ప్రత్యేకహోదా బదులు ప్యాకేజీ ఇస్తానని కేంద్రం అంటే ఒప్పుకున్నాం. ఇప్పుడా ప్యాకేజీ కూడా లేదు. కాబట్టి మేం మళ్లీ ప్రత్యేక హోదాను డిమాండ్‌ చేస్తాం అని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వంపై యుద్ధంలో మూడంచెల వ్యూహాన్ని సిద్ధం చేశామన్నారు. మొదటిగా కేబినెట్‌లో ఉన్న టీడీపీ మంత్రుల రాజీనామా చేస్తారని, రెండో దశలో ఎంపీల రాజీనామాల గురించి ఆలోచిస్తున్నామని తెలిపారు. చివరిదైన మూడో అడుగులో బీజేపీతో తెగదెంపులు చేసుకుంటాం. ఆదివారం జరుగనున్న టీడీపీ కీలక సమావేశంలో ఈ మేరకు వార్‌ డిక్లరేషన్‌ ఉంటుంది’’ అని టీజీ వెంకటేశ్‌ చెప్పారు.

Next Story
Share it