Telugu Gateway
Andhra Pradesh

సఖ్యత...సమరం ముగిశాయి..వాట్ నెక్ట్స్!

సఖ్యత...సమరం ముగిశాయి..వాట్ నెక్ట్స్!
X

కేంద్రంతో మనకు చాలా అవసరాలు ఉంటాయి. సఖ్యతతో ఉండే ఏదైనా సాధించుకోగలం. ఇదీ తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏడాదిగా చెబుతున్న మాట. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీపడేది లేదు. సస్పెండ్ చేసినా సరే..పోరాటం ఆపొద్దు. టెలికాన్ఫరెన్స్ లో ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం ఇది. ఓకే. సఖ్యత అయిపోయింది...పార్లమెంట్ సాక్షిగా సమరం అయిపోయింది. మరి ఇక ఇఫ్పుడు ఏంటి?. సఖ్యతతో ఉండి సాధించలేకపోయారు. పార్లమెంట్ సాక్షిగా ఉభయ సభల్లో పోరాడి సాధించలేకపోయారు. అదికార పార్టీ ఎంపీలు, ప్రతిపక్ష ఎంపీలు ఎంత గోల చేసినా ప్రధాని నరేంద్రమోడీ ఎందుకు డోంట్ కేర్ అన్నారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మళ్లీ అదే పాత పాట ఎందుకు పాడారు. మరి ఇక తెలుగుదేశం పార్టీ ఏమి చేయబోతోంది. ఇఫ్పటికైనా కేంద్రంలో మంత్రివర్గ సభ్యులుగా ఉన్న వారు బయటకు వస్తారా?. లేక మార్చి వరకూ ఇదే ‘డ్రామా’ను కొనసాగిస్తారా?. ప్రధాని మోడీ ఏపీ ప్రయోజనాలకు ఎందుకు పట్టించుకోవటం లేదు?. భాగస్వామ్యపక్షంగా ఉన్న పార్టీ టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పార్లమెంట్ సాక్షిగా ప్రధాని మోడీకి..ఇలా అయితే తమ నిర్ణయాన్ని సమీక్షించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు కూడా.

అయినా సరే అటు ప్రధాని నరేంద్ర మోడీ కానీ...ఇటు అరుణ్ జైట్లీ కానీ ఏ మాత్రం ఏపీకి సాయంపై ‘ప్రత్యేక శ్రద్ద’ పెట్టిన దాఖలాలు లేవు. టీడీపీనే ఒకప్పుడు ‘ప్యాకేజీ’నే సూపర్ అని ప్రకటించింది. హోదా వేస్ట్..ప్యాకేజీ బెస్ట్ అని నినదించింది. అంతే కాదు..అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు ఊరు..వాడా సన్మానాలు కూడా చేసింది టీడీపీ సర్కారు. కానీ ఇప్పుడు హోదా లేదు...ప్యాకేజీ లేదు..వెనకబడిన జిల్లాల ఆర్థిక సాయం లేదు. అసలు ఏపీకి చట్టబద్దంగా రావాల్సిన నిధుల విషయంలో కూడా ఎందుకు దేబిరించాల్సిన పరిస్థితి?. తానెవరికీ భయపడాల్సిన పనిలేదని..తానే తప్పుచేయలేదని చెప్పుకునే చంద్రబాబు మరి ఎందుకు ఇదంతా చేస్తున్నట్లు?. ఏపీ ప్రజలను ఇంతలా వంచిస్తున్న కేంద్రానికి ఇప్పటికైనా గుడ్ బై చెప్పకపోతే బిజెపితో పాటు టీడీపీ కూడా ఆ ఫలితాన్ని చూడాల్సి ఉంటుందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.

Next Story
Share it