‘తిరుపతి’లో రిలయన్స్ ఎలక్ట్రానిక్ పార్కు

దేశంలోని అగ్రశ్రేణి పారిశ్రామిక సంస్థ రిలయన్స్ ఆంధ్రప్రదేశ్ లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అయింది. వ్యవసాయంతోపాటు ఎలక్ట్రానిక్స్ రంగంలో ఈ సంస్థ పెట్టుబడులు పెట్టనుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ మంగళవారం నాడు అమరావతిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు అంశాలపై చర్చలు సాగాయి. ఏపీ సచివాలయంలో అమలు చేస్తున్న రియల్‌టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీ) సెంటర్‌ను అంబానీ సందర్శించారు. దీని పనితీరును చంద్రబాబు స్వయంగా ముఖేష్ అంబానీకి వివరించారు. రిలయన్స్ ప్రాధమికంగా అంగీకరించిన దాని ప్రకారం తిరుపతిలో 150ఎకరాల్లో ఎలక్ర్టానిక్స్ పార్కు ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.
ఇందులో ఏటా కోటి జియో సెల్‌ఫోన్లు తయారు చేస్తారు. జియో ఫోన్లు, చిప్ డిజైన్, బ్యాటరీలు, సెట్‌టాప్ బాక్స్ ల వంటివన్నీ ఈ ఎలక్ట్రానిక్స్ పార్కులో తయారు చేసే అవకాశం ఉంది. ఎలక్ర్టానిక్స్ వస్తువుల తయారీలో విద్యార్థులకు ఇందులోనే శిక్షణ కూడా ఇవ్వనున్నారు. దీంతోపాటు అమరావతిలో 50 ఎకరాల్లో డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, టెలికాం, ఐటీ సార్టప్ ఎకో సిస్టమ్‌ను అభివృద్ది చేసేందుకు ముఖేశ్ అంగీకరించారు. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో 150మెగావాట్ల సోలార్ ప్లాంట్, డేటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ‘‘ఏపీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం. అమరావతిని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసేందుకు రిలయన్స్ సహకారం ఉంటుంది’’ అని అంబానీ తెలిపారు.