Telugu Gateway
Andhra Pradesh

కొత్త మలుపు తిరిగిన జగన్ అక్రమాస్తుల కేసు

కొత్త మలుపు తిరిగిన జగన్ అక్రమాస్తుల కేసు
X

జగన్ అక్రమాస్తుల కేసుల సెగ దేశ ప్రధాని నరేంద్రమోడీకి కూడా తాకింది. ఇందూటెక్ జోన్ ఎస్ ఈజెడ్ కు సంబంధించిన వ్యవహారంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఐటి సెజ్ తోపాటు రియల్ ఎస్టేట్ వెంచర్ కోసం ఇందూటెక్ జోన్ కు మామిడిపల్లి దగ్గర 250 ఎకరాలు కేటాయించిన సంగతి తెలిసిందే. నిబంధనలకు విరుద్ధంగా ఈ సెజ్ కు భూ కేటాయింపులు జరిగాయి. మంత్రివర్గ ఆమోదంతో ఈ పని చేశారు. అయితే ఎంతకూ ఈ సెజ్ టేకాఫ్ కాలేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డిపై సీబీఐ కేసులు దాఖలు చేయటంతో ఈ ప్రాజెక్టు పూర్తిగా అటకెక్కింది. ఐటి సెజ్ కోసం అప్పనంగా భూమి పొందిన శ్యాంప్రసాద్ రెడ్డి తర్వాత కాలంలో జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు. ఇదంతా కూడా క్విడ్ ప్రో కో అనే ఆరోపణలతో సీబీఐ కేసు దాఖలు చేసింది. తర్వాత కాలంలో ప్రాజెక్టు అడుగు ముందుకు సాగలేదు. ఇందూటెక్ జోన్ లో శ్యాంప్రసాద్ రెడ్డి ఒక్కరే కాకుండా..మారిషస్ కు చెందిన కరీసా ఇన్వెస్ట్ మెంట్ సంస్థ 49 శాతం కలిగి ఉంది. ఈ సంస్థ సెజ్ ప్రాజెక్టు కోసం మొత్తం 115 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్ డిఐ) రూపంలో ఈ మొత్తం నిధులు సమకూర్చారు. సెజ్ ప్రాజెక్టు అటకెక్కటంతో ఈ సంస్థ పెట్టుబడులు కూడా ఆగిపోయాయి.

దీంతో ఈ సంస్థ వినతి మేరకు మారిషస్ ప్రభుత్వం నెదర్లాండ్స్‌ లోని ఆర్బిట్రేషన్ కోర్టును ఆశ్రయించింది. ప్రధాని మోదీ సహా పలువురు మంత్రులకు నోటీసులు పంపించింది. ఇందూ టెక్ జోన్ ఐటీ సెజ్ కేసులో జగన్, శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి సహా పలువురిపై సీబీఐ చార్జిషీట్‌లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసుకు సంబంధించి ప్రధాని మోదీకి నోటీసులు పంపడమే కాకుండా కేంద్ర ఆర్థిక, వాణిజ్య, న్యాయ, పట్టణాభివృద్ధి శాఖల మంత్రులను ప్రతివాదులుగా చేర్చింది. రెండు దేశాల మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం పెట్టుబడులకు రక్షణ కల్పించాల్సి ఉన్నందున ఈ నోటీసులు జారీ చేశారు. దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే.

Next Story
Share it