Telugu Gateway
Politics

‘చంద్రబాబును’ ఇరికించిన పవన్ కళ్యాణ్

‘చంద్రబాబును’ ఇరికించిన పవన్ కళ్యాణ్
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘ప్రత్యేక హోదా’ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని విజయవంతంగా ఇరికించారు. కొద్ది రోజులుగా నిజ నిర్ధారణ కమిటీ (జెఎఫ్ సీ) పేరుతో హైదరాబాద్ లో సమావేశాలు నిర్వహించిన పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా సాధనకు ‘అవిశ్వాస తీర్మానం’ పెట్టాలని సూచించారు. రాష్ట్రంపై చిత్తశుద్ధి ఉంటే ఈ పని చేయవచ్చని సూచించారు. అంతే ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి వెంటనే ఈ అస్త్రాన్ని అందుకున్నారు. కేంద్రంలో అధికార ఎన్డీయే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు తాము రెడీ అని..అందుకు మీ మిత్రపక్షం తెలుగుదేశం పార్టీని ఒప్పించాలని పవన్ ను డిమాండ్ చేశారు. తెలుగుదేశం అవిశ్వాసం పెట్టినా తాము మద్దతు ఇవ్వటానికి రెడీ అని...లేదంటే తామే అవిశ్వాస తీర్మానం పెడతామని సంచలన ప్రకటన చేశారు. దీంతో అధికార తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఇరకాటంలో పడటం ఖాయంగా కన్పిస్తోంది. ఓ వైపు నేరుగా ప్రధాని నరేంద్రమోడీ, బిజెపిపై విమర్శలు చేయటానికి సాహసించని చంద్రబాబు...పార్లమెంట్ లో మోడీ సర్కారుపై అవిశ్వాస తీర్మానం పెట్టగలరా? అంటే ఖచ్చితంగా నో అని చెప్పొచ్చు.

చంద్రబాబుకు మేలు చేయటానికి రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్ ప్లాన్ కాస్తా ఇప్పుడు ఏకంగా ఆయన్ను ఇరకాటంలో పడేయటానికి వైసీపీకి ఓ అస్త్రంగా మారిందనే వ్యాఖ్యలు టీడీపీ వర్గాల నుంచే విన్పిస్తున్నాయి. పవన్ చేసిన సూచనను స్వాగతించిన జగన్..తాము ఎవరి మంచి సలహా ఇచ్చినా తీసుకుంటామని ప్రకటించారు. ప్రకాశం జిల్లా కందుకూరు సభలో మాట్లాడుతూ జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో పవన్ పై జగన్ విమర్శలు గుప్పించారు. ‘ జెఎఫ్ సీ పేరుతో మీ కమిటీ పరిశోధన... కోడి గుడ్డు మీద ఈకలు పీకినట్లుగా ఉంది. ఎంతిచ్చారు.. ఎంత తీసుకున్నారన్న విషయం పక్కనబెట్టి రాష్ట్ర ప్రయోజనాలను రక్షించే ప్రత్యేక హోదాపై మీరు పోరాడాలి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే అభివృద్ధికి కావాల్సిన నిధులు వాటంతట అవే వస్తాయి. హోదాతో సమానంగా ప్యాకేజి ఇస్తామని కేంద్ర అన్నదట.. సరే మరి అయితే అని దానికి చంద్రబాబు తలూపారట. హోదాకు ప్యాకేజికి నక్కకు నాగలోకానికి ఉన్న తేడా వుంది. హోదా వస్తే ఆదాయపు పన్ను, జీఎస్టీలను పెట్టుబడులు పెట్టే కంపెనీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. మరి ప్యాకేజీలో అలాంటి నిబంధనలు ఉంటే చూపించండి.

నాలుగేళ్లుగా ఏళ్లుగా చంద్రబాబు బీజేపీతో కలసి ఉన్నారు. టీడీపీ ఎంపీలను కేంద్రంలో మంత్రులుగా పెడతాడు. బడ్జెట్‌ ప్రకటించేప్పుడు మంత్రులకు కేటాయింపుల వివరాలు తెలుస్తాయి. అయినా వాటిని ప్రశ్నించకుండా.. అలానే ఆమోదింపజేశాడు. గత నాలుగేళ్లుగా ఇదే జరుగుతోంది. ప్రతి బడ్జెట్‌ కేటాయింపుల అనంతరం బీజేపీని పొగిడాడు. గత ఏడాది అన్ని రాష్ట్రాల కన్నా మనమే ఎక్కువ సాధించాం అన్నాడు. ఏ రాష్ట్రానికైనా ఇంతకన్నా ఎక్కువ వచ్చాయా? ప్రశ్నించాడు. ఆ కథనాన్ని ప్రతి పక్షాలకు చంద్రబాబు సవాల్‌ అని ఓ దినపత్రిక రాసింది. కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులు రాష్ట్రానికి ఏం చేయకపోయినా వెళ్లిన ప్రతిసారీ వారందరికీ శాలువాలు కప్పుతాడు. వాళ్లు చెవిలో క్యాబేజీ పెడితే పెట్టించుకుంటాడు. రాష్ట్రానికి వచ్చి మన చెవిలో పువ్వు పెడదామని చూస్తాడు.’ అని చంద్రబాబు, పవన్ లపై విమర్శలు గుప్పించాడు. పవన్ కళ్యాణ్ చేసిన సూచనను స్వీకరించిన జగన్...అదే సవాల్ తో చంద్రబాబును ఇప్పుడు ఇరకాటంలో లాగారు. మొత్తానికి పవన్ జగన్ కు ఓ మంచి అస్త్రాన్ని అయితే అందించాడు.

Next Story
Share it