టీటీడీ బోర్డు వేయలేని నిస్సహాయస్థితిలో చంద్రబాబు!
‘నేనెవరికీ భయపడను. నేనెందుకు భయపడాలి. నేనేమి తప్పుచేయలేదు. ఓకే. మరి ఎందుకు ఏడాది కాలంగా టీటీడీ బోర్డును నియమించలేకపోతున్నారు?. రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి లేకుండా ఏడాది పూర్తి చేసుకోబోతోంది. 2017 ఏప్రిల్ 26 నుంచి టీటీడీ పాలక మండలి లేకుండా కేవలం అధికారుల పెత్తనంతోనే సాగుతుంది. చంద్రబాబునాయుడు తీవ్ర విమర్శలు చేసే కాంగ్రెస్ పాలన సమయంలోనూ ఇంతటి దారుణమైన పరిస్థితులు ఎప్పుడూ లేవు. కాంగ్రెస్ అంటే అధిష్టానం ఢిల్లీలో ఉంటుంది కాబట్టి కొంత జాప్యం జరిగేది. అప్పటి వరకూ ఉన్నతాధికారులతో కనీసం ‘స్పెసిఫైడ్ అథారిటీ’ వేసేవారు. కానీ వ్యవస్థలను నాశనం చేశారు..భ్రష్టుపట్టించారు అనే విమర్శలు చేసే చంద్రబాబు మాత్రం అటు బోర్డు వేయటం లేదు...అటు స్పైసిఫైడ్ అథారిటీని నియమించలేదు.
ప్రభుత్వవర్గాలు కూడా ఈ పరిణామాలు చూసి అవాక్కు అవుతున్నాయి. టీటీడీకి సంబంధించి ఇంత దారుణమైన పరిస్థితులు గతంలో ఎన్నడూలేవని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. టీటీడీలో ఓ వైపు అన్యమతస్థులైన ఉద్యోగులను తొలగించాలని ఆందోళన సాగుతుంటే ..చంద్రబాబు మాత్రం కేవలం రాజకీయ అవసరాల కోసం ఏసుక్రీస్తు సువార్త సభలకు హాజరైన పుట్టా సుధాకర్ యాదవ్ కు ఈ పదవి కట్టబెట్టేందుకు చంద్రబాబు ప్లాన్ చేశారు.దీనిపై విమర్శలు వెల్లువెత్తినా రాజకీయ అసవరాలు ముఖ్యం కాబట్టి ముందుకెళటానికే చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. కానీ నెలలకు నెలలు గడుస్తున్నాయి కానీ టీటీడీ బోర్డు నియామకం మాత్రం పూర్తి కావటం లేదు. ఒక్క టీటీడీ ఏమిటి?. ఆర్టీసీ ఛైర్మన్ వంటి కీలక పదవులు కూడా భర్తీ చేయకుండానే వదిలేశారు. ప్రతిపక్షంలో ఉండగా..కార్యకర్తలే దేవుళ్ళు...నాయకులే పార్టీకి రక్ష అంటూ పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చి ఇప్పుడు పూర్తిగా వదిలేశారనే విమర్శలు పార్టీ నాయకుల నుంచే విన్పిస్తున్నాయి.