Telugu Gateway
Politics

‘అవిశ్వాసం’ సీన్ లోకి కాంగ్రెస్!

‘అవిశ్వాసం’ సీన్ లోకి కాంగ్రెస్!
X

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కదిపిన ‘అవిశ్వాసం’ వ్యవహారం రకరకాల మలుపులు తిరుగుతోంది. ప్రత్యేక హోదా అంశంపై చిత్తశుద్ధి ఉంటే టీడీపీ, వైసీపీలు లోక్ సభలో మోడీ సర్కారుపై అవిశ్వాసం పెట్టాలని పవన్ డిమాండ్ చేశారు. పవన్ డిమాండ్ పై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటనే రియాక్ట్ అయ్యారు. తాము మోడీ సర్కారుపై అవిశ్వాసం పెట్టడానికి రెడీ అని..దీనికి టీడీపీని ఒప్పించాలని పవన్ ను డిమాండ్ చేశారు. అయితే ఈ డిమాండ్ పై పవన్ వైపు ఇంత వరకూ స్పందన లేదు. ఈ పరిణామాలు అధికార టీడీపీని ఇరకాటానికి గురిచేసేవే. ఇప్పుడు విభజన చేసిన కారణంగా ఏపీలో పూర్తిగా నష్టపోయిన కాంగ్రెస్ పార్టీ మళ్లీ పుంజుకునేందుకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకునే పనిలో పడింది. ప్రత్యేక హోదాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కూడా లోక్ సభలో అవిశ్వాసం పెట్టే అంశంపై ముందుకు సాగుతోంది. ఇఫ్పటికే ఏపీ కాంగ్రెస్ నేతలు ఇదే అంశంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో చర్చలు కూడా జరిపారు. లోక్ సభలో అవిశ్వాసం పెట్టాలంటే కావాల్సిన మెజారిటీ వైసీపీ, టీడీపీలకు లేదు. కాంగ్రెస్ రంగంలోకి దిగితే తప్ప..ఇది సాధ్యంకాదు. అయితే కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం పెడితే బిజెపి మిత్రఫక్షంగా ఉన్న టీడీపీ దీనికి మద్దతు పలుకుతుందా?. అంటే ఖచ్చితంగా నో అని చెప్పొచ్చు.

ఓ వైపు రాష్ట్రానికి చేయాల్సిన సాయంపై కేంద్రంతో పోరాడుతున్నామని చెప్పుకునే టీడీపీ అవిశ్వాసానికి మద్దతు ఇవ్వకపోతే ఆ మేరకు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కోవటం ఖాయం. అయితే కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసం పెడితే జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇస్తారా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగానే ఉంది. ఒకవేళ ఈ విషయంలో జగన్ వెనక్కి తగ్గినా రాజకీయంగా ఆయనకు అది తీరని నష్టం చేయటం ఖాయం. మొత్తానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ‘అవిశ్వాసం’ అంశాన్ని తెరపైకి తెచ్చి ఏపీ రాజకీయాల్లో మరింత వేడిరాజేశారు. తాజా పరిణామాలు చూస్తుంటే ఈ వ్యవహారం ఎన్నెన్నో మలుపులు తిరిగే సూచనలు కన్పిస్తున్నాయి. మార్చిలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో అవిశ్వాస తీర్మాన వ్యవహారం అటో ఇటో తేలటం ఖాయంగా కన్పిస్తోంది. అప్పటికే టీడీపీ, బిజెపిల మిత్రత్వంపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Next Story
Share it