నందమూరి బాలకృష్ణకు సర్జరీ

టాలీవుడ్ సీనియర్ హీరో..తెలుగుదేశం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు శనివారం నాడు హైదరాబాద్ లో మేజర్ సర్జరీ జరిగింది. గత కొంత కాలంగా ఆయన చేతికైన గాయంతో బాధపడుతున్నారు. జాప్యం చేస్తే ఇది మరింత పెరిగే ప్రమాదం ఉండటంతో సర్జరీ చేయించుకున్నారు. నగరంలోని కాంటినెంటల్ హాస్పిటల్ లో ఈ సర్జరీ జరిగింది. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా షూటింగ్ సమయంలోనే బాలకృష్ణ గాయపడ్డారు. అప్పటి నుంచే ఆయన చేతిగాయం సమస్యతో బాధపడుతున్నారు. తాత్కాలిక ఉపశమనం కోసం ప్రాథమిక చికిత్స తీసుకున్నారు.
అనంతరం ఆయన జైసింహా చిత్రం షూటింగ్ సందర్భంగా బిజీబిజీగా ఉండటంతో సర్జరీ చేయించుకోలేకపోయారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. వరస షూటింగ్‌లతో ఆయన గాయం, నొప్పి రోజురోజుకి తీవ్రమయింది. దీంతో సర్జరీ అనివార్యమని వైద్యులు తేల్చిచెప్పడంతో శనివారం ఉదయం బాలకృష్ణ కాంటినెంటల్ హాస్పిటల్లో చేరారు. పలు వైద్యపరీక్షలు జరిపిన అనంతరం కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ దీప్తి నందన్ రెడ్డి, డాక్టర్ ఆశిష్ బాబుల్కార్(పూణే)లు సర్జరీ చేశారు. ఈ సర్జరీ విజయవంతంగా పూర్తయింది.