మోడీ టార్గెట్ గా మార్చి 4 నుంచి టీడీపీ ఆందోళనలు

ఆంధ్రప్రదేశ్ లో అధికార తెలుగుదేశం పార్టీ ప్రధాని నరేంద్రమోడీ టార్గెట్ గా మార్చి 4 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయటానికి రెడీ అయిపోయింది. దీనికి సంబంధించి పార్టీ కోసం సోషల్ మీడియాలో పనిచేస్తున్న యువతను సిద్ధం చేసింది. పార్టీకి ఏ మాత్రం సంబంధం లేదన్నట్లే ఇవి నడుస్తాయి..కానీ నడిపించేది మాత్రం టీడీపీనే. ఇప్పటికే అన్ని జిల్లాలకు దీనిపై స్పష్టమైన సంకేతాలు వెళ్ళాయని టీడీపీ వర్గాలు తెలిపాయి. ఈ ధర్నాల సమయంలో ప్రధాని మోడీ దిష్టిబొమ్మల దగ్ధం కార్యక్రమం ప్లాన్ చేశారు. ఏపీకి హామీ ఇచ్చిన ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీల విషయంలో అన్యాయం జరిగిందని చంద్రబాబునాయుడు గత కొన్ని రోజులుగా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే బిజెపి కూడా అదే స్థాయిలో ఎదురుదాడి చేస్తోంది. ప్రత్యేక హోదా వల్ల ఉపయోగం లేదని..హోదా పొందిన రాష్ట్రాలు ఏ మేరకు ప్రయోజనం పొందాయని చంద్రబాబు గతంలో చేసిన వ్యాఖ్యలను ఉదహరిస్తూ టీడీపీని ఇరకాటంలో పెడుతోంది బిజెపి. హోదా గురించి మాట్లాడితే జైలులో పెడతామని కూడా హెచ్చరించారు. ఇదే విషయాన్ని బిజెపి ఇప్పుడు చాలా ఎగ్రెసివ్ గా ముందుకు తీసుకెళుతోంది. అంతే కాదు..గతంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యల గురించి మీడియా సీఎంను ప్రశ్నించాలని మరీ బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు డిమాండ్ చేశారు.
ఈ అంశాలు మరింత లోతుగా ప్రజల్లోకి వెళ్ళే లోగానే ప్రధాని మోడికి వ్యతిరేకంగా ఏపీలో ఆందోళనలకు శ్రీకారం చుట్టించి..ఇష్యూని డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు రంగం సిద్ధం చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి. మార్చి 4 నుంచి ఆందోళనలో పాల్గొనేది అంతా టీడీపీ సోషల్ మీడియా టీమ్ సభ్యులే విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉంది. ఏపీ ప్రభుత్వంలో ఇద్దరు బిజెపి నేతలకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. మరి ఇలా అక్కడా..ఇక్కడా అధికారంలో భాగస్వాములుగా ఉండి మోడీకి వ్యతిరేకంగా ధర్నాలు చేయిస్తే బిజెపి చూస్తూ ఊరుకుంటుందా?. ఇప్పటికే దూకుడుగా వెళుతున్న ఆ పార్టీ ఎలా వ్యూహం అనుసరిస్తుందో వేచిచూడాల్సిందే. మొత్తానికి మార్చి నెల ఏపీ రాజకీయాలకు చాలా కీలకంగా మారటం మాత్రం ఖాయంగా కన్పిస్తోంది.