Telugu Gateway
Telangana

తెలంగాణలో వేడెక్కిన ‘రాజకీయం’

తెలంగాణలో వేడెక్కిన ‘రాజకీయం’
X

ఎన్నికలకు ఏడాది సమయం ఉండగానే తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ లు సవాళ్ళ మీద సవాళ్ళు విసురుకుంటున్నాయి. ఎవరికివారు సర్వేల పేరు చెప్పి ప్రజల మూడ్ మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ తమకు వంద సీట్లు తక్కువ కాకుండా వస్తాయని చెబుతుంటే...ప్రతిపక్ష కాంగ్రస్ మాత్రం తమకు 70 సీట్లు గ్యారంటీ..అధికారం తమదే అని ధీమాగా చెబుతోంది. కాంగ్రెస్ సర్వే లెక్కలపై ఫైర్ అయిన మంత్రి కెటీఆర్ బుధవారం నాడు సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి వచ్చి..మళ్లీ కెసీఆర్ సీఎం కాకపోతే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని..అందుకు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సిద్ధమా? అని సవాల్ విసిరారు. తన వయస్సు చాలా తక్కువ అని..అయినా తాను ఈ సవాల్ విసురుతున్నానని కెటీఆర్ ప్రకటించారు. కెటీఆర్ సవాల్ పై కాంగ్రెస్ నేతలు కూడా అదే తరహాలో స్పందించారు. కెటీఆర్ సవాల్ తెలంగాణ వస్తే దళితుడిని సీఎం చేస్తాననే హామీ వంటిది కాదు కదా? అని మాజీ మంత్రి డీ కె అరుణ కౌంటర్ ఎటాక్ చేశారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తీవ్రస్థాయిలో కెటీఆర్ పై ధ్వజమెత్తారు. సవాల్ ను తాను కూడా సై అన్నారు. 2019 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాకపోతే.. తాను, తన కుటుంబసభ్యులు రాజకీయాల తప్పుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే.. కేటీఆర్‌తోపాటు ఆయన కుటుంబసభ్యులు, కేసీఆర్‌, కవిత, హరీష్‌ రావు కూడా రాజకీయాల నుంచి తప్పుకోవాలని సవాల్‌ విసిరారు.

'కేటీఆర్‌ విసిరిన సవాల్‌కు నేను కట్టుబడి ఉన్నాను. 2019లో కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే.. నేను, నా కుటుంబసభ్యులు రాజకీయాల నుంచి తప్పుకుంటాం. నేను, నా భార్య ఇద్దరం రాజకీయాల నుంచి వైదొలుగుతాం. మీకు (కేటీఆర్‌కు), మీకుటుంబసభ్యులకు కూడా ఇదే వర్తిస్తుంది. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాకుంటే హరీశ్‌రావు, కేటీఆర్‌, కేసీఆర్‌, కవిత రాజకీయాల్లోనుంచి తప్పుకోవాలి. ఎన్నికలు 2018లో వచ్చినా.. 2019 లో వచ్చినా కాంగ్రెస్ అందుకు సిద్ధమే. 100 సీట్లు రాకుంటే కేసీఆర్ ఏమంటాడు? రాజకీయంలో కేటీఆర్‌ ఓ బచ్చా. రాహుల్ గాంధీ మూడోసారి ఎంపీగా పూర్తి చేసుకున్నారు. అయినా ఏ పదవి అడగలేదు. కమిషన్ ఏజెంట్‌గా పనిచేస్తున్న మీరు గాంధీ కుటుంబంపై ఆరోపణలు చేయడం విడ్డురంగా ఉంది' అని ఉత్తమ్‌ మండిపడ్డారు. తెలంగాణలో జరుగుతున్నది మీడియా మేనేజ్ మెంట్ తప్ప..మరొకటి కాదన్నారు. కెసీఆర్ పాలనలో తెలంగాణలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. మీ పాలన అంత సక్కగా ఉంటే..విమర్శలను కూడా ఎందుకు తట్టుకోలేకపోతున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.

Next Story
Share it