Telugu Gateway
Telangana

2014 లోనే రాలేదు...ఇప్పుడు టీఆర్ఎస్ కు అన్ని సీట్లు వస్తాయా!

2014 లోనే రాలేదు...ఇప్పుడు టీఆర్ఎస్ కు అన్ని సీట్లు వస్తాయా!
X

అది 2014. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన సంవత్సరం. సెంటిమెంట్ ఏరులై పారుతోంది. పార్టీలకు అతీతంగా చాలా వరకూ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వైపు మొగ్గుచూపిన పరిస్థితి. పార్టీలు ఏదైనా ఈ సారి మాత్రం ఓటు కెసీఆర్ కే అని చాలా మంది బహిరంగంగా చెప్పారు. ఇది అప్పట్లో కాంగ్రెస్, టీడీపీ నేతలకు ఒకింత మింగుడుపడని అంశంగా మారింది. అయినా సరే చేసేదేమీ లేక చేతులెత్తేశారు. తెలంగాణలో మెజారిటీ ప్రజలు కోరుకున్న సొంత రాష్ట్రం సిద్ధించిన తర్వాత..సెంటిమెంట్ అంత బలంగా ఉన్న సమయంలోనే ఎన్నికలు జరిగితే 119 అసెంబ్లీ స్థానాలు ఉన్న తెలంగాణలో టీఆర్ఎస్ గెలుచుకున్నది కేవలం 63 సీట్లు మాత్రమే. తర్వాత అన్ని పార్టీల నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించి కలుపుకున్నారు..అది వేరే విషయం. రాష్ట్రం వచ్చిన కొత్తలో..సెంటిమెంట్ బలంగా ఉన్న సమయంలోనే 63 సీట్లు వస్తే..ఇప్పుడు టీఆర్ఎస్ కు 106 సీట్లు వస్తాయా?. అంటే నో ఛాన్స్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. టీఆర్ఎస్ ను ఏదో తెలియని టెన్షన్ వెంటాడుతోంది. అందుకే ముఖ్యమంత్రి కెసీఆర్ మొదలుకుని మంత్రులు అందరూ వంద సీట్ల జపం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఏమంత సులభంకాదనే అభిప్రాయం పార్టీ వర్గాల్లోనే వ్యక్తం అవుతోంది. అందుకే ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా రైతాంగాన్ని తన వైపు తిప్పుకోవాలని కెసీఆర్ ప్రయత్నాలు ప్రారంభించారు.

అవసరం అయితే దేశవ్యాప్త రైతాంగ ఉద్యమానికి తెలంగాణ రైతు సమితులు నాయకత్వం వహిస్తాయట. నిన్నటి దాకా పెద్ద నోట్లు రద్దు మొదలుకుని..జీఎస్టీ వరకూ మోడీ ఏది అంటే దానికి రైట్ రైట్ అని చెప్పేసిన సీఎం కెసీఆర్ ఇప్పుడు ఒక్కసారిగా మోడీపై రివర్స్ గేర్ వేయటం వెనక ‘ ఓటమి భయమే’ కారణం అని చెబుతున్నారు. ఈ నాలుగేళ్ల టీఆర్ ఎస్ పాలనలో ఉమ్మడి రాష్ట్రానికి మంచి అణచివేతలు సాగాయి. ధర్నాలకు నో ఛాన్స్..బంద్ లకు నో ఛాన్స్..అసలు ప్రశ్నిస్తేనే సహించే పరిస్థితి లేదు. ఎప్పుడో సమావేశాలు ఉన్న సమయంలో తప్ప సొంత పార్టీ ఎమ్మెల్యేలే సీఎంను కలుసుకోలేని దుస్థితి. చాలా మంది మంత్రులదీ అదే బాట. పరిపాలనా అంతా ఏకపక్షంగా సాగుతుందని సొంత పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. పైగా వివిధ పార్టీల నుంచి వచ్చిన ఫిరాయింపుదారులతో సొంత పార్టీ నేతల తకరారు..సీట్ల కేటాయింపు పంచాయతీలు ఎలాగూ ఉండనే ఉంటాయి. కేవలం ప్రత్యర్థి పార్టీలను మైండ్ గేమ్ తో వెనక్కి నెట్టేందుకే ఈ వంద సీట్ల ప్రచారం తప్ప..క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఏ మాత్రం అనుకూలంగా లేవనేది ఎక్కువ మంది నేతల అభిప్రాయం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఒక్క పోలీసులు తప్ప..మిగిలిన అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగుల్లో సర్కారు తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోందని ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు వెల్లడించారు.

Next Story
Share it