చంద్రబాబు గెలుపుపై పారిశ్రామికవేత్తలకు సందేహాలు!
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం గెలుపుపై పారిశ్రామికవేత్తల్లో సందేహాలు ఉన్నాయా?. అంటే అవునంటున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. స్వయంగా ఆయనే ఈ విషయం చెప్పారు. ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో ఈ విషయం వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవకపోతే మా పరిస్థితి ఏంటి? అని కొంత మంది పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారని..అయితే తన గెలుపు ఇబ్బంది ఏమీ ఉండదని వారికి తాను గట్టిగా చెబుతున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి విషయంలో కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిని హైదరాబాద్, ముంబయ్ , బెంగుళూరులతో పోల్చటం లేదు. ప్రపంచంలోని బెస్ట్ సిటీలతో పోల్చుకుంటున్నా? అని వ్యాఖ్యానించారు. అసలు ఇంత వరకూ అక్కడే నిర్మాణాలే మొదలుకాలేదు కానీ అమరావతిని ప్రపంచంలోని బెస్ట్ సిటీలతో పోల్చుకుంటున్నా? అని చంద్రబాబు చెప్పటం సంచలనంగా మారనుంది. నిజంగా పరిపాలనా నగరమో లేక మరో నగరం నిర్మించి..ఇవి ప్రపంచ స్థాయి నిర్మాణాలు అంటే ఓ అంచనాకు రావచ్చు. కానీ అసలు నిర్మాణాలే లేకుండా ఏకంగా ప్రపంచ బెస్ట్ నగరాలతో పోల్చుకుంటున్నట్లు చెప్పటం ఆసక్తికరంగా మారింది.
అదే సమయంలో ఇంకో పదేళ్లకుపైగా తాను అధికారంలోకి వస్తే తప్ప..అమరావతి పూర్తికాదని చెబుతున్నారు చంద్రబాబు. వచ్చే ఎన్నికల్లో పోటీ మీ మధ్య, జగన్ మధ్యే ఉంటుంది కదా?. మీకే ఎందుకు ఓటు వేయాలని ప్రజలను అడుగుతారని ప్రశ్నించగా..ప్రతి వారం కోర్టుకెళ్ళే వారిని చూసి పెట్టుబడులు పెడతారా? అసలు ఈ పోలికే కరెక్ట్ కాదు. కానీ మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి కొన్ని తప్పవు. ప్రజలు నా కష్టాన్ని చూసి నాకు అవకాశం ఇస్తారని నమ్ముతున్నారు. నిద్రపోయే సమయం తప్ప అంతా రాష్ట్ర ప్రజల కోసమే ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ ను రాజకీయాల్లోకి రావాలనే తానే కోరినట్లు చంద్రబాబునాయుడు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సేవ చేయాలని ఉద్దేశం ఉంటే రాజకీయాల్లోకి లోకేష్ కు రావాలని చెప్పినట్లు వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి ఎవరి వల్ల మేలు జరుగుతుందో ప్రజలు ఆలోచిస్తారని తెలిపారు.