Telugu Gateway
Politics

చింతమనేని ప్రభాకర్ కు మూడేళ్ల జైలు శిక్ష

చింతమనేని ప్రభాకర్ కు మూడేళ్ల జైలు శిక్ష
X

తెలుగుదేశం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చిక్కుల్లో పడ్డారు. నిత్యం దూకుడుగా ఉంటూ వార్తల్లో నిలిచే ఆయనకు..ఓ పాత కేసుల్లో కోర్టు శిక్ష విధించింది. ఆయనకు ఈ షాక్ ఇచ్చింది భీమడోల్ మెజిస్ట్రేట్ కోర్టు. మూడు వేర్వేరు కేసుల్లో ఆయనకు మూడేళ్లు జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. 2011లో అప్పటి మంత్రి వట్టి వసంత్‌కుమార్‌పై చింతమనేని ప్రభాకర్‌ చేయి చేసుకున్నారు. అంతే కాకుండా వట్టి వసంత్‌ కుమార్‌ గన్‌మెన్‌పై చేయిచేసుకున్న కేసులో దోషిగా నిర్ణయిస్తూ భీమడోలు మెజిస్ట్రేట్‌ కోర్టు తీర్పు వెలువరించింది. 2011 జూన్ నెలలో దెందులూరు హైస్కూల్ లో జరిగిన రచ్చబండలో అప్పటి మంత్రి హోదాలో ఉన్న వట్టి వసంత్ కుమార్ పై దెందులూరు ఎమ్మెల్యేగా ఉన్న చింతమనేని దౌర్జన్యం చేయడంతో పాటు అప్పటి ఎంపి కావూరి సాంబశివరావు , ప్రజలందరి సమక్షంలోనే చేయి చేసుకున్నారు. దీనిపై అప్పటి మంత్రి వట్టి వసంత్‌ కుమార్‌ గన్ మెన్ ఫిర్యాదు మేరకు దెందులూరు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

దీనిపై పోలీసులు నాలుగు సెక్షన్లగా కేసు నమోదు చేశారు. ఏడేళ్లగా కేసు వాదోపవాదనలు జరగగా నేడు (బుధవారం) కోర్టు తీర్పు వెలువరించింది. సెక్షన్ 506(2) గా రెండేళ్ల జైలు శిక్ష, వెయ్యి రూపాయిల జరిమానా....సెక్షన్ 353 గా ఆరు నెలల జైలు శిక్ష, వేయి రూపాయిల జరిమానా, సెక్షన్ 7(1) గా ఆరు నెలలు జైలు శిక్ష తో పాటు 500 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. మొత్తంగా మూడేళ్ల జైలు శిక్ష, 2500 జరిమానా విధిస్తూ మేజిస్ట్రేట్ సంచలన తీర్పు వెల్లడించారు. అన్ని శిక్షలు ఏకకాలంలో అమలు చేయాలని తీర్పునివ్వడంతో చింతమనేనికి గరిష్టంగా రెండేళ్ల జైలు శిక్ష వర్తిస్తుంది. తీర్పు వెలువడే సమయంలో తన అనుచరులతో చింతమనేని కోర్టుకు హాజరయ్యారు. తీర్పు వెలువడిన వెంటనే చింతమనేని బెయిల్ పిటీషన్ దాఖలు చేయగా, కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

Next Story
Share it