‘అపరిచితుడిలా’ చంద్రబాబు!
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ ‘అపరిచితుడిలా’ వ్యవహరిస్తున్నారా?. అంటే టీడీపీ వర్గాలు కూడా ఔననే అంటున్నాయి. గత కొంత కాలంగా ఆయన వేస్తున్న పిల్లిమొగ్గలు చూసి సొంత పార్టీ నాయకులే అవాక్కవుతున్నారు. ప్రభుత్వం వచ్చిన కొత్తలో ప్రత్యేక హోదా పదేళ్ళు కాదు...పదిహేనేళ్ళు కావాలి అని డిమాండ్ చేశారు చంద్రబాబు. అదీ రహస్యంగా చెప్పిన మాటలు ఏమీ కాదు...వీడియో రికార్డుల సాక్షిగా మరీ ఈ మాటలు చెప్పారు. ఎన్నికల బహిరంగ సభల్లో ప్రత్యేక హోదా హామీ ఇఛ్చిన బిజెపి..తూచ్ హోదా లేదు..గీదా లేదు...అంటే ఓకే..ఓకే అని చంద్రబాబు వెనక్కి తగ్గారు. ప్రత్యేక ప్యాకేజీనే బెటర్ అని అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడికి సన్మానాలు..ఊరేగింపులు చేశారు. అంతే కాదు సుమా...హోదా ఏమైనా సంజీవినా? అని ప్రశ్నించారు కూడా చంద్రబాబు. హోదా కంటే ప్యాకేజీనే బెటర్...అదనంగా ఎన్నో నిధులు వస్తాయి అని ప్రకటించారు. బిల్లులో ఉన్న అంశాలనే ప్యాకేజీ పేరుతో ప్రకటించి..అవి కూడా కేంద్రం అమలు చేయలేదు. హోదా పోయింది..ప్యాకేజీ పోయింది.ఏపీ గతి ఏంటి అని అందరూ ప్రశ్నిస్తే..‘మనమే ఎక్కువ సాధించాం. ఏ రాష్ట్రానికైనా ఇంత కంటే ఎక్కువ వచ్చాయా?.’ అని విలేకరుల సమావేశం పెట్టి మరీ సవాళ్లు విసిరారు. ఇప్పుడేమో అందరికీ ఇచ్చినట్లే ఇఛ్చారు...మాకు ప్రత్యేకంగా ఏమిచ్చారు? అని ప్రశ్నిస్తున్నారు.
ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న కొద్దీ రాజకీయంగా తిప్పలు తప్పవనే ఉద్దేశంతో మళ్ళీ చంద్రబాబులో ‘అపరిచితుడు’ మేల్కొని ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని చెబుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ హోదాలో చంద్రబాబు వైఫల్యాలను రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడింది. మరి చంద్రబాబు ఏమి చేయాలి. విభజనతో నష్టపోయిన ఏపీకి కేంద్రం నుంచి హోదాతో పాటు సాధ్యమైనంత ఎక్కువ సాయం పొంది ఆ ప్రయత్నాలను విఫలం చెయ్యాలి. కానీ అదేమి చేయకుండా చంద్రబాబునాయుడు ‘పొలిటికల్ గేమ్’ ఆడుతున్నారు. ఓ వైపు కాంగ్రెస్ మోసం చేసినట్లే బిజెపి కూడా మోసం చేసిందని నిత్యం చెబుతూ కేంద్రంలో ఆ ప్రభుత్వ భాగస్వామిగా ఉండటంలో ఏమైనా అర్థం ఉందా?.. అదే బిజెపి నేతలను రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగించటంలో ఔచిత్యం ఏముంది?. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను అస్త్రంగా ఉపయోగించుకుని జగన్ ను దెబ్బతీయటానికి ప్రయత్నిస్తే పవన్ అవగాహనారాహిత్యంతో అది కాస్తా వికటించింది. జగన్ కు దమ్ము..ధైర్యం ఉంది కేంద్రంతో జగన్ పోరాడాలి అని పవన్ సూచించారు. అంటే గత ఎన్నికల్లో తాను పక్కన ఉండి ప్రచారం చేసిన చంద్రబాబుకు అవేమీ లేవని పవన్ కళ్యాణ్ నమ్ముతున్నారా?.. ఏమో పవనే ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాలి?.