Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు..నారాయణలకు బెస్ట్ ‘ప్లానింగ్ అవార్డులు’!

చంద్రబాబు..నారాయణలకు బెస్ట్ ‘ప్లానింగ్ అవార్డులు’!
X

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ‘ప్లానింగ్ లో దిట్ట’. ఆయన 2050కి ఏపీని ప్రపంచంలో..దేశంలో ఎక్కడ నిలబెట్టాలో తెలుసు. ఆ రకంగా ప్లాన్ చేస్తారు. అంతటి అనుభవం ఆయన సొంతం. తన ప్లానింగ్ కు ధీటుగా పనికొస్తాడని భావించే సీఎం చంద్రబాబునాయుడు నారాయణకు అత్యంత కీలకమైన మునిసిపల్ పరిపాలనా శాఖతో పాటు రాజధాని నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. వీరిద్దరూ కలసి చేస్తున్న ‘ప్లానింగ్’ చూసి లండన్ లోని నార్మన్ ఫోస్టర్ కంపెనీ కూడా అవాక్కు అవుతుందట. ఎందుకంటే నార్మన్ ఫోస్టర్ చేసిన డిజైన్లకూ వీరిద్దరూ కలసి చేసిన ‘సిఫారసులు’..సూచించిన మార్పులు ఎన్నో. వీరిద్దరి ప్లానింగ్ ప్రకారమే నార్మన్ ఫోస్టర్ ఎట్టకేలకు డిజైన్లు పూర్తి చేసి..బతుకు జీవుడా అని అమరావతి నుంచి పారిపోనుందట. చంద్రబాబు, నారాయణల ప్లానింగ్ మంత్రులు..ఎమ్మెల్యేలే కాదు ఏపీ ప్రజలకు అడుగడుగునా కన్పిస్తూనే ఉంది.

ఏపీ తాత్కాలిక రాజధాని వెలగపూడిలో అసెంబ్లీ నిర్మించి ఇంకా సరిగ్గా ఏడాది కూడా నిండలేదు. కట్టింది కూడా టాయిలెట్లు లేకుండా...వర్షం కురిస్తే చాలు నీరు జలపాతాలను తలపించేలా కిందకు ఉరికొచ్చేలా కట్టారు. వీరి అద్భుతమైన ప్లానింగ్ ఎలా ఉంది అంటే..అక్కడ పనిచేసే వందలాది మంది సిబ్బంది టీ తాగేందుకు అవసరమైన క్యాంటీన్ కూడా లేకుండా అద్భుతంగా డిజైన్ చేశారు. ఈ ప్లానింగ్ ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. ప్రస్తుత అసెంబ్లీకి ఆనుకుని ఇప్పుడు సుమారు పది వేల చదరపు అడుగుల్లో మరో కొత్త భవనం నిర్మిస్తారట. వెలగపూడి అసెంబ్లీ నిర్మాణానికే కాంట్రాక్టర్లకు అదనపు చెల్లింపుల పేరుతో కోట్ల రూపాయలు దుబారా చేశారు. ఇప్పుడు మరో భవనం అట.

365 రోజుల్లో అసెంబ్లీ 50 రోజులు జరిగితే గొప్ప. పోనీ అది ఏమైనా పాత భవనం..సరిపోవటం లేదు అనుకుంటే అందులో ఓ పద్దతి ఉంటుంది. కానీ నిండా ఏడాది కూడా కాలేదు ఈ భవనం కట్టి. కొత్తగా అధికారంలోకి వచ్చిన వ్యక్తి అవగాహన లేకుండా అలా చేశారనుకుంటే కూడా అర్థం చేసుకోవచ్చు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన నార్మన్ ఫోస్టర్ కు సలహాలు ఇవ్వగలిగే చంద్రబాబు, నారాయణలకు ఇక్కడి లోపాలు ఎందుకు కనపడలేదబ్బా? అని అందరూ అవాక్కు అవుతున్నారు. వెలగపూడిలో కొత్తగా ఓ పది వేల చదరపు అడుగుల్లో భవనం..ఆ తర్వాత అసలు అంటే శాశ్వత అసెంబ్లీ నిర్మాణం అన్న మాట. ఇదొక్కటే కాదు..దాదాపు 108 కోట్ల రూపాయలతో హైకోర్టు తాత్కాలిక భవనం నిర్మిస్తారట. వారం పది రోజుల్లో శాశ్వత భవనాలకు సంబంధించి డిజైన్లు వస్తున్నప్పుడు వందల కోట్ల రూపాయలు వెచ్చించి మళ్ళీ తాత్కాలిక హైకోర్టు భవనం ఏంటో అర్థం కావటంలేదని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అంటే ప్లానింగ్ లో దిట్ట అయిన చంద్రబాబు, నారాయణలు ఐదేళ్ల కాలాన్ని ‘తాత్కాలిక’ భవనాలతోనే పూర్తి చేస్తారన్న మాట. ఖచ్చితంగా వీరిద్దరికీ నార్మన్ ఫోస్టర్ ‘బెస్ట్ ప్లానింగ్’ అవార్డులు ఇవ్వాల్సిందే.

Next Story
Share it