Telugu Gateway
Andhra Pradesh

రాజీనామాలపై చంద్రబాబు భయం అందుకేనా?

రాజీనామాలపై చంద్రబాబు భయం అందుకేనా?
X

‘ఒకే ఇంట్లో ఉంటారు. ఒకరిపై ఒకరికి అపనమ్మకం. పోనీ కలసి ఉంటారా?. అంటే అదీ లేదు. నువ్వు సరిగా చేయలేదంటే..నువ్వు సరిగా చేయలేదని రోడ్డెక్కి తిట్టుకుంటున్నారు?. పోనీ ఇలా పడని వారు ఎవరి ఇళ్ళు వాళ్లు చూసుకోవచ్చు కదా?. అంటే అదీ కాదంటారు?. ఒకే చోట ఉంటారంట? రోజూ కొట్టుకుంటారంట. ఇది ఓ స్వాతంత్ర పోరాటం అట. గతంలో ఎన్నడూలేనీ రీతిలో ఓ ‘కొత్త సినిమా’ చూస్తున్నారు ఏపీ ప్రజలు. గత కొన్ని రోజులుగా బిజెపి,టీడీపీలకు సంబంధించి సాగుతున్న ఈ వెరైటీ రాజకీయం చూసి టీడీపీ వర్గాలు కూడా విస్మయానికి గురవుతున్నాయి. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విభజనతో నష్టపోయినా ఏపీకి అన్యాయం చేస్తుందని బహిరంగంగా ఆరోపిస్తున్నప్పుడు కేంద్ర కేబినెట్ లో టీడీపీకి చెందిన మంత్రులను ఎలా కొనసాగిస్తారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది. ఏపీకి న్యాయం జరగలేదనే కారణంతో మంత్రులు బయటకు వచ్చినా..భవిష్యత్ అవసరాల కోసం బయటి నుంచి మద్దతు ఇస్తామన్నా ఒకింత గౌరవంగా ఉండేదని..కానీ ప్రభుత్వంలో కొనసాగుతూ ‘పోరాటం’ అంటే చూసేవాళ్ళకు కూడా ఎబ్బెట్టుగా ఉందని ఓ టీడీపీ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.

ఓ వైపు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఏప్రిల్ 6న తమ ఎంపీలు రాజీనామా చేస్తారని ప్రకటించటంతో అధికార తెలుగుదేశం పార్టీపై ఒత్తిడి మరింత పెరిగింది. అయితే ఈ ఒత్తిడి పైకి కన్పించకుండా ఉండేందుకు నానా తంటాలు పడుతోంది. తెలుగుదేశం పార్టీ కేంద్ర మంత్రివర్గం నుంచి బయటకు వచ్చిన మరుక్షణం నుంచి మోడీ సర్కారు అసలు ఆట స్టార్ట్ చేస్తుందని..అప్పుడు చంద్రబాబుకు తిప్పలు మొదలవుతాయని చెబుతున్నారు. ప్రస్తుతం టీడీపీ తరపున కేంద్ర మంత్రివర్గంలో ఉన్న మంత్రులు ఇద్దరూ అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరిలు బిజెపితో అత్యంత సన్నిహితంగా ఉంటున్నారు. పార్టీ నేతల వద్ద అంతర్గత సంభాషణల్లో సుజనా చౌదరి కేంద్రం ఇప్పటికే చాలా ఇఛ్చిందనే వ్యాఖ్యలు చేయటం టీడీపీ శ్రేణులను షాక్ కు గురిచేస్తోంది. మరో కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు అయితే ఈ వ్యవహారాలు ఏమీ తనకు సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఎలాచూసినా టీడీపీ పరిస్థితి ముందుకెళ్ళినా..వెనక్కివెళ్ళినా గోతిలో పడటం ఖాయం అన్న చందంగా తయారైందని చెబుతున్నారు.

Next Story
Share it