Telugu Gateway
Politics

దేశంలో ‘కాస్ట్ లీ’ సీఎం చంద్రబాబే

దేశంలో ‘కాస్ట్ లీ’ సీఎం చంద్రబాబే
X

‘‘ నా చేతికి వాచీ ఉండదు. జేబులో పది రూపాయలు కూడా ఉండవు.’’ ఇవీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిత్యం చెప్పే మాటలు. అంత మాత్రాన ఆయనకు ఆస్తి లేదనుకుంటే పొరపాటే. దేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అత్యంత ఖరీదైన ముఖ్యమంత్రిగా నిలిచారు. దేశంలోని అందరి ముఖ్యమంత్రుల్లో ఆయన ఆస్తుల్లో అగ్రస్థానంలో నిలిచారు. అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌(ఏడీఆర్‌) నివేదిక ఈ విషయాలు బహిర్గతం చేసింది. దేశంలోని మొత్తం 31 మంది ముఖ్యమంత్రుల్లో 24 మంది (81 శాతం) కోటీశ్వరులేనని ఏడీఆర్‌ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబు నాయుడు రూ.177 కోట్లకు పైగా ఆస్తులతో దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా నిలిచినట్లు ఏడీఆర్‌ నివేదిక బహిర్గతం చేసింది. అరుణాచల్‌ప్రదేశ్‌ సీఎం పెమా ఖండూ రూ.129 కోట్లకుపైగా ఆస్తులతో రెండోస్థానంలో, పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ రూ.48 కోట్లతో మూడోస్థానంలో నిలిచారు.

దేశంలో ముఖ్యమంత్రుల సగటు ఆస్తి రూ.16.18 కోట్లుగా ఉందంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన సీఎంల అఫిడవిట్లను పరిశీలించిన ఏడీఆర్, నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌(ఎన్‌ఎల్‌డబ్ల్యూ)లు ఈ నివేదికను రూపొందించాయి. దేశంలోని అతిపేద ముఖ్యమంత్రుల్లో త్రిపుర సీఎం మాణిక్‌ సర్కార్‌ రూ.27 లక్షల ఆస్తులతో తొలిస్థానంలో నిలవగా, పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ(రూ.30 లక్షలుపైగా), జమ్మూకశ్మీర్‌ సీఎం మెహబూబా ముఫ్తీ(రూ.56 లక్షలు) తర్వాతి స్థానాలో నిలిచారు.

Next Story
Share it