అమరావతిలో చంద్రబాబు ‘బ్లాంక్ దోపిడీ’
‘హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లో మనకు ఓ పది ఎకరాల ఖాళీ స్థలం ఉంది. దాన్ని డెవలప్ మెంట్ కు ఇవ్వాలనుకుంటాం. నిర్మాణ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంటాం. అందులో భాగంగా ముందు ఎవరికెంత వాటా? అంటే స్థలం సొంతదారుకు 60 శాతం నిర్మిత స్థలం, బిల్డర్ కు 40 శాతం. లేదా ఫిఫ్టీ పిఫ్టీ తీసుకుంటాం. స్థలం ఉన్న ప్రాంతాన్ని బట్టి కొంత మంది బిల్డర్లు ఎకరాకి ఇంత చొప్పున కొంత మొత్తం నగదు కూడా చెల్లిస్తారు. రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో ఇది అత్యంత సహజంగా జరిగే వ్యవహారం. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రదబాబునాయుడి దగ్గరకు వచ్చే సరికి అమరావతిలో కొత్త కొత్త కుంభకోణాలకు తెరతీస్తున్నారు. స్టార్టప్ ఏరియాలో సింగపూర్ సంస్థలకు సర్కారు ఫ్రీ హోల్డ్ ప్రాతిపదికన 200 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించింది. అయితే ఈ 200 ఎకరాల్లో ఎవరి వాటా ఎంత? అన్న సంగతి తేల్చకుండానే ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీసీఆర్ డీఏ) ఒప్పందాన్ని సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా జోక్యం చేసుకుని మరీ ఈ అడ్డగోలు ఒప్పందాన్ని రెడీ చేయించారని చెబుతున్నారు. అయితే దీనికి సహజంగానే ఆర్థిక, న్యాయ శాఖలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఎవరి వాటా ఎంతనే విషయం తెలియకుండా ‘ఖాళీలు’ పెట్టి ఒప్పందాలు ఎలా చేసుకుంటారని..ఈ తరహా వ్యవహారం ప్రభుత్వంలో గతంలో ఎప్పుడూ జరగలేదని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
ప్రభుత్వం ఏకంగా ఈ తరహా ఒప్పందాలకు దిగటంపై అధికారులు కూడా అవాక్కు అవుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ వ్యవహారంలో సింగపూర్ సంస్థల కు ఎలా కొమ్ముకాస్తున్నారో అర్థం అవుతుందనే వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. స్విస్ ఛాలెంజ్ వ్యవహారాన్నే చంద్రబాబు ఓ పెద్ద స్కామ్ గా మార్చిన విషయం తెలిసిందే. స్వయంగా ఓ ముఖ్యమంత్రి సింగపూర్ సంస్థల ఒప్పందంలో ‘ఖాళీలు’ ఉంచి ఒప్పందాన్ని ఓకే చేయించాలని చూడటంలోనే ఇందులో మతలబు అర్థం అవుతోందని అంటున్నారు. మరి ఇక దీన్ని కూడా కేబినెట్ లో పెట్టి అలాగే ఆమోదింపచేస్తారేమో చూడాల్సిందే. అధికారులు వద్దంటున్నా...కేబినెట్ లో పెట్టి ఇలాంటి అడ్డగోలుగా నిర్ణయాలు ఎన్నో తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ ఒప్పందంలో కూడా అదే కనుక జరిగితే ఏపీ చరిత్రలో ఇది ఓ కొత్త ‘దోపిడీ అధ్యాయం’గా మిగలటం ఖాయంగా చెబుతున్నారు.