ఏపీలో ఒక్కో మంత్రికి మూడు కోట్లతో బంగ్లాల నిర్మాణం
ఒక్కో బంగ్లా నిర్మాణ వ్యయం అక్షరాలా 2.85 కోట్ల రూపాయలు. అదీ భూమి విలువ లేకుండానే. కేవలం నిర్మాణ ఖర్చే. అందునా ఏపీలో ఇసుక ఉచితం. అయినా సరే రేటు జూమ్ అంది. ఎందుకంటే అందులో స్కామ్ ఉంది అంటున్నారు నిర్మాణ రంగ నిపుణులు. హైదరాబాద్ వంటి మహానగరంలోనే ప్రతిష్టాత్మక సంస్థలు అందించే విల్లాలే భూమితో కలుపుకుని 2.5 నుంచి 3 కోట్ల రూపాయల వరకూ ఉంటున్నాయి. కానీ ఘనత వహించిన చంద్రబాబునాయుడి సర్కార్ మాత్రం అవినీతిలో కొత్త రికార్డులు నెలకొల్పుతోంది. నూతన రాజధాని ప్రాంతంలో మంత్రులకు బంగ్లాలు కట్టడాన్ని ఎవరూ ఆక్షేపించరు. కానీ ఏకంగా ఈ రేట్లు చూసిన వారికి మాత్రం కళ్ళు తిరుగుతున్నాయి. రాజధాని అమరావతి ప్రాంతంలో మంత్రులతో పాటు జడ్జీలకు నివాస సముదాయాలు కట్టాలని ఏపీసీఆర్ డీఏ నిర్ణయించింది. అందులో భాగంగా శనివారం నాడు టెండర్ పిలిచింది. జీ ప్లస్ వన్ విధానంతో ఈ నిర్మాణాలు చేపట్టనున్నారు. మొత్తం 71 బంగ్లాల నిర్మాణానికి 203 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచారు.
సీఆర్ డీఏను ముఖ్యమంత్రి చంద్రబాబు తన దోపిడీకి అడ్డాగా మార్చుకున్నారనే విమర్శలు అధికార వర్గాల నుంచే వస్తున్నాయి. దీంతో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారులకు కూడా మొత్తం 115 బంగ్లాలు నిర్మించనున్నారు. ఇక్కడ ఒక్కో బంగ్లాకు రెండు కోట్ల రూపాయల ఖర్చు చూపిస్తున్నారు. ఇక్కడ కూడా అదే సీన్. కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే అపార్ట్ మెంట్ల విషయంలో సీఆర్ డీఏ ఇలాగే చేసింది. ఐఏఎస్ ల కోసం అపార్ట్ మెంట్ల నిర్మాణం కోసం 1.40 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచారు. ఖరీదైన ప్రాంతంలో భూమితో కలుపుకునే ఈ రేటుకు అపార్ట్ మెంట్ వస్తుంది. కానీ సీఆర్ డీఏ మాత్రం కేవలం నిర్మాణ ఖర్చులకే 1.40 కోట్ల రూపాయలు లెక్కకట్టింది. సింగపూర్ సంస్థల దగ్గర నుంచి మొదలుపెడితో రోడ్డు పనులు, హైబ్రిడ్ యాన్యుటీ పనులు అన్నీ ‘ఎంపిక చేసిన’ సంస్థలకు మాత్రమే దక్కుతున్నాయి. అంటే ఈ దోపిడీ డిజైన ఎంత పక్కాగా చేస్తున్నారో ఊహించుకోవచ్చు.