Telugu Gateway
Politics

మార్చి5న టీడీపీ మంత్రుల రాజీనామా..తూచ్

మార్చి5న టీడీపీ మంత్రుల రాజీనామా..తూచ్
X

ఆంధ్రప్రదేశ్ కు చెందిన మంత్రి ఆదినారాయణరెడ్డి గురువారం సాయంత్రం కీలక ప్రకటన చేశారు. మార్చి 5 నాటికి తాము కోరిన హామీలు అమలు చేయకపోతే బిజెపి ప్రభుత్వం నుంచి తమ మంత్రులు బయటకు వస్తారని ఆయన వెల్లడించారు. అదే రోజు తమ పార్టీ ఎంపీలు కూడా రాజీనామా చేస్తారని తెలిపారు. వైసీపీ ఎంపీల రాజీనామా ఏప్రిల్ 6 అయితే...తమ పార్టీ ఎంపీలు మార్చి5న రాజీనామా చేస్తారని తెలిపారు. ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే...‘‘వైఎస్సార్‌సీపీ ఎంపీల కంటే ముందు మా ఎంపీలతో రాజీనామాలు చేయిస్తాం. రాజీనామాల్లో టీడీపీదే ప్రీ షెడ్యూల్. వైఎస్సార్‌సీపీ డెడ్‌లైన్ ఏప్రిల్ 6 అయితే మాది మార్చి 5. పార్లమెంట్‌లో కేంద్రం ఏపీకి అనుకూల ప్రకటన చేయకపోతే ఆరోజే మా కేంద్రమంత్రులు రాజీనామా చేస్తారు.

అదేరోజు బీజేపీతో తెగతెంపులు చేసుకుంటాం. 19 అంశాలు కేంద్రం ముందుంచాం, ఒక్కటి చేయకపోయినా అదే పొత్తుకు చివరిరోజు.’’ అని సంచలన ప్రకటన చేశారు. కారణాలేంటో తెలియదు కానీ మంత్రి ఆదినారాయణరెడ్డి తన మాటలను వెనక్కి తీసుకున్నారు. తాను చేసిన వ్యాఖ్యలు అన్నీ వ్యక్తిగతం అని..పార్టీకి ఏ మాత్రం సంబంధంలేదన్నారు. మార్చి 5 రాజీనామాలకు డెడ్‌లైన్‌ అన్నది పార్టీ నిర్ణయం కాదని తెలిపారు. ఇప్పటికే తమ ఎంపీల రాజీనామా తేదీలను ప్రకటించిన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గురువారం నాడు మరో అడుగు ముందుకేసి ఏపీకి చెందిన ఎంపీలు అందరూ రాజీనామా చేస్తే కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వక ఏమి చేస్తుందని సవాల్ విసిరారు. తమతో కలసి రావాలని అధికార టీడీపీని కోరారు. ఎంపీల రాజీనామాతో ప్రత్యేక హోదా కోసం కలసి వస్తారా? లేక ఏపీ ప్రయోజనాలను ‘ప్రత్యేక ప్యాకేజీ’కి అమ్మేస్తారా? అని ప్రశ్నించారు.

Next Story
Share it