విదేశాల్లో చంద్రబాబుకు పోలవరం ముడుపులు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి చంద్రబాబుకు ముడుపులు అందాయని..అదీ విదేశాల్లోనే ముట్టచెప్పారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ సంచలన ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించి తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని తెలిపారు. విభజన చట్టం అమలు విషయంలో ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడులు ఇద్దరూ డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు.
చట్టంలో లోపాలు ఉంటే మెజారిటీ ఉన్న బిజెపి సవరణలు చేయవచ్చు కదా? దీనికి కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇస్తుందని అన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అయిన తర్వాత ఏపీకి సంబంధించిన విభజన హామీలు అన్నీ అమలు చేస్తామని జైరాం రమేష్ తెలిపారు. నాలుగేళ్ళుగా టీడీపీ పునాదిరాళ్ళకే పరిమితం అయిందని అన్నారు. విభజన అమలు విషయంలో భాగస్వామ్య పార్టీలుగా ఉన్న బిజెపి, టీడీపీలు ఘోరంగా విఫలమయ్యాయని ఆరోపించారు.