ఆ విమానాల్లో ‘లవ్ సూట్’
విమానయానం నిత్యం కొత్త పుంతలు తొక్కుతూనే ఉంది. కొన్ని విమానాల్లో ఏకంగా ‘రెసిడెన్సీ’ పేరుతో ప్రీమియం ఎయిర్ లైన్స్ డబుల్ బెడ్ రూమ్ సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చాయి. అంతే కాదు..డబుల్ డెక్కర్ (ఏ 380) విమానాల్లో ఎంచక్కా బార్ లో కూర్చుని మందుకొట్టినట్లు ఎంజాయ్ చేసే సౌకర్యం కూడా ఉంది. ఇప్పుడు బ్రిటన్ కు చెందిన ప్రముఖ ఎయిర్ లైన్స్ వర్జిన్ అట్లాంటిక్ తన ప్రయాణికుల కోసం కొత్త సౌకర్యాలను అందుబాటులోకి తెస్తోంది. అందులో ఒకటి ‘లవ్ సూట్’. దీంతో పాటు తమ కొత్త విమానాల్లో సోలో ఫ్రీడమ్ సూట్, సోలో కార్నర్ సూట్ ను అందుబాటులోకి తెస్తోంది.
ఫ్రీడం, కార్నర్ సూట్ లు సింగిల్ గా ప్రయాణించే వారి కోసం డిజైన్ చేశారు. లవ్ సూట్ మాత్రం జంట లేదా వారిష్టం. ఈ కొత్త సూట్లతో కూడిన విమానం ఈ ఏడాది మార్చి నుంచే సర్వీసులను ప్రారంభించనుంది. ఎయిర్ బస్ ఏ 330-200 విమానాల్లో ఈ కొత్త సౌకర్యాలు రానున్నాయి. దీంతో పాటు మరిన్ని విలాసవంతమైన సౌకర్యాలు తమ ప్రయాణికులకు అందించేందుకు వర్జిన్ అట్లాంటా ఎయిర్ లైన్స్ సన్నాహాలు చేస్తోంది. కొత్త విమానాలు పూర్తిగా వైఫై సౌకర్యం కలిగి ఉంటాయి.