Telugu Gateway
Politics

‘కొత్త సినిమా’లకు ఇక పవన్ నో!

‘కొత్త సినిమా’లకు ఇక పవన్ నో!
X

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక కొత్త సినిమాలు చేయరా?. అంటే ఆయన సన్నిహిత వర్గాలు మాత్రం ఎన్నికలు పూర్తయ్యే వరకూ కొత్త ప్రాజెక్టులకు అంగీకరించే అవకాశం లేదని చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికలబరిలోకి దిగాలని చూస్తున్న పవన్ కళ్యాణ్ రాజకీయాలపై ఇక నుంచి ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. వాస్తవానికి ఆయన గతంలో పలుమార్లు తాను పలానా తేదీ నుంచి ఇక రాజకీయాలకే సమయం కేటాయిస్తానని ప్రకటించినా అవి ఏమీ అమల్లోకి రాలేదు. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా సరిగ్గా ఏడాదే సమయం ఉంది. ఈ దశలో కొత్త సినిమా అంగకరిస్తే అది పూర్తవటానికి ఎంత వేగంగా చేసినా ఆరు నెలల సమయం పడుతుంది. అంటే రాజకీయాలకు పవన్ కు ఏ మాత్రం సమయం చిక్కదు. పవన్ ‘కాల్షీట్’ రాజకీయాలపై ఇఫ్పటికే తీవ్ర విమర్శలు ఉన్నాయి. అందుకే ఆయన ఏడాది పాటు సినిమాలకు తాత్కాలిక బ్రేక్ ఇవ్వటం ఖాయం అని చెబుతున్నారు. ఏపీలో కూడా జనసేన పూర్తి స్థాయిలో బరిలోకి దిగే ఆలోచనలో కన్పించటం లేదు.

పరిమిత సీట్లలోనే పోటీ చేయాలనే యోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నట్లు సమాచారం. తెలంగాణ విషయానికి సంబంధించి కూడా జనసేన పోటీచేసే సీట్ల అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ మధ్యే పవన్ కళ్యాణ్ తెలంగాణ సీఎం కెసీఆర్ ను ప్రగతి భవన్ కు వెళ్లి మరీ భేటీ అయి..ఆయనపై పొగడ్తల వర్షం కురిపించి వచ్చిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకున్న కెసీఆర్,,పవన్ లు ఇప్పుడు స్నేహగీతాలు పాడుకుంటున్నారు. మరి ఈ స్నేహగీతాలు ఎన్నికల్లో కూడా ఉంటాయా? లేదా అన్నది వేచిచూడాల్సిందే. అధికార టీఆర్ఎస్ కు ఈ సారి తెలంగాణలో గట్టిపోటీ ఖాయంగా కన్పిస్తోంది. అందుకే కెసీఆర్ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే పవన్ తోనూ స్నేహం చేస్తున్నారు. మరి ఈ స్నేహం ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచిచాల్సిందే.

Next Story
Share it