Telugu Gateway
Politics

‘పవన్’ రాస్తున్న కొత్త రాజ్యాంగం!

‘పవన్’ రాస్తున్న కొత్త రాజ్యాంగం!
X

ప్రశ్నల పేరుతో పుట్టిన కొత్త పార్టీ..అసలు ప్రశ్నలే వద్దు అంటోంది. ముఖ్యమంత్రులపై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. అది తెలంగాణ కావొచ్చు...ఏపీ కావొచ్చు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ మోడల్ అందరికీ కొత్త కొత్తగా ఉంది. చూస్తుంటే జనసేనాని కొత్త రాజ్యాంగం రాస్తున్నట్లు కన్పిస్తోందనే వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రభుత్వం చేసిన మంచి పనులను విస్మరించి..తప్పులను మాత్రమే ఎత్తిచూపుతుంది. అంతే కానీ..చంద్రబాబు శభాష్...కెసీఆర్ శభాష్ అంటే ఆయా పార్టీలకు అసలు మనుగడే ఉండదు. దేశంలో ఎక్కడైనా ఇదే తరహా రాజకీయం ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ తీరు చూస్తుంటే మాత్రం రాజకీయ నాయకులే విస్మయానికి గురయ్యే పరిస్థితి ఉంది.

నిజంగా పవన్ కళ్యాణ్ అంత స్వచ్చమైన రాజకీయాలు చేయాలని కోరుకునే వ్యక్తే అయితే...గత ఎన్నికల ముందు వరంగల్ సభలో కెసీఆర్ ను నీ తాటతీస్తా అని ఎందుకు హెచ్చరించినట్లు?. నా భార్యలు, వ్యక్తిగత అంశాల గురించి మాట్లాడితే ఏ నేత ఎవరెవరితో తిరుగుతున్నారో నా అభిమానులు క్షణాల్లో సమాచారం ఇస్తారని ఎందుకు అన్నట్లు?. ప్రజారాజ్యంలో ఉండగా...వైఎస్ ను బట్టలూడదీసేలా కొడతారు? అని ఎందుకు వ్యాఖ్యానించినట్లు?. ఈ మాటలు చూస్తుంటే ఆయన కూడా అవకాశవాద రాజకీయాలు చేస్తున్నట్లే కదా?. ఏపీలో తిరుగుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు కష్టపడి పనిచేస్తున్నారని..ఆయన చేస్తున్న పనులకు తాను అడ్డం పడనని ప్రకటిస్తారు. ఇప్పుడు తెలంగాణ పర్యటనలోనూ అదే క్యాసెట్ వేశారు. అదే సమయంలో తెలంగాణ సీఎం కెసీఆర్ పైనా ప్రశంసల వర్షం కురిపించారు.

కెసీఆర్ చాలా కష్టపడి పనిచేస్తున్నారని సర్టిఫై చేసేశారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తిచూపకుండా...అసలు తన బలం ఏంటో..బలగం ఏంటో తెలియకుండా రాజకీయ రంగంలో ఉన్నానని ప్రకటించటంపైనే విస్మయం వ్యక్తం అవుతోంది. ఏపీలోనూ, తెలంగాణలోనూ ప్రభుత్వాలు ప్రజాస్వామ్యయుతంగా చేసే బంద్ లు..ధర్నాలకు కూడా అనుమతి ఇవ్వకుండా అడ్డుకుంటున్న విషయం తెలిసిందే. అయినా సరే పవన్ కళ్యాణ్ మాత్రం ప్రభుత్వాలతో గొడవలు పెట్టుకోనని..ప్రభుత్వాలను గౌరవించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. చూస్తుంటే పవన్ కళ్యాణ్ ఏపీలోనూ, తెలంగాణలోనూ అధికార పార్టీలతోనే ముందుకు సాగేట్లు కన్పిస్తోందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 2019 ఎన్నికల్లో ఏపీలో టీడీపీతో, తెలంగాణలో టీఆర్ఎస్ తో సీట్ల సర్దుబాటు చేసుకోవచ్చని చెబుతున్నారు.

Next Story
Share it