పవన్...పొగిడినా జైల్లో పెడతారా!

పవన్ కళ్యాణ్ ప్రతి మాటా వెరైటీనే. ఆయన రాజకీయ పార్టీపై ఇప్పటికే ఎన్నో విమర్శలు ఉన్నాయి. దానికి కారణం ఆయన మాటలే. ఎవరైనా పార్టీ పెట్టేది ఓట్ల కోసం..గెలవటం కోసం. గెలిస్తే అధికారంలోకి వచ్చి మంచి పనులు చేయటం కోసం అని చెబుతారు. కానీ అదేంటో పవన్ కళ్యాణ్ ఓ సారి మీ ఓటు అడగను. మీకు నచ్చితే వేయండి లేకపోతే లేదు అంటారు. ఓటు వేయకపోయినా ప్రజా సమస్యల కోసమే పోరాడతా అని ప్రకటించారు అనంతపురం జిల్లా పర్యటనలో. తనపై ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా భయపడను అని..జైల్లో పెట్టినా వెనకాడను అని ప్రకటించారు. తెలంగాణలోనూ..ఆంధ్రప్రదేశ్ లోను ఓ వైపు ముఖ్యమంత్రులను గుక్కతిప్పుకోకుండా పొగుడుతుంటే అసలు పవన్ కళ్యాణ్ ను జైలులో ఎవరు పెడతారు?. ఎందుకు పెడతారు? అన్నదే పెద్ద ప్రశ్న. అధికార పార్టీల అవినీతిపై విపక్షాలు గగ్గోలు పెడుతుంటే వాటిపై ఒక్క మాట కూడా మాట్లాడని పవన్ కళ్యాణ్ తాను ప్రభుత్వాలకు అసౌకర్యం కల్పించే పనులేమీ చేయనని ప్రకటిస్తారు.
అంటే ఒకసారి గెలిస్తే ఆ ప్రభుత్వం తన ఇష్టానుసారం ఎన్ని పనులైనా చేసుకోవచ్చా?. ఎంత అవినీతికి అయినా పాల్పడవచ్చా?. అవినీతిని ప్రశ్నిస్తే ప్రభుత్వాల పనికి అవరోధం ఏర్పడుతుందని మిగిలిన పార్టీలు ఏమీ అనకుండా ఉండాలా?. జనసేనతో కొత్త రాజకీయాలు తెస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటిస్తే ఏంటో అనుకున్నారు కానీ..ఈ కొత్త తరహా రాజకీయం చూసి ఇప్పటికే రాజకీయాల్లో ఉన్న వారు అందరూ అవాక్కు అవుతున్నారు. ఏపీలో, తెలంగాణల్లో సాగునీటి ప్రాజెక్టులతో పాటు పలు అంశాలపై ప్రభుత్వ అవినీతికి సంబంధించి విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఇవేమీ పట్టించుకోని పవన్ కళ్యాణ్ తన పర్యటనలతో..నిత్యం గందరగోళమైన వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను మరింత గందరగోళంలోకి నెడుతున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.