కెసీఆర్ వల్లే...మరి అసలు మంత్రి పాత్రే లేదా?
తెలంగాణలో రైతాంగానికి 24 గంటల సరఫరా వ్యవహారం ఇప్పుడు ఓ హాట్ టాపిక్. అసాధ్యాన్ని తాము సుసాధ్యం చేశామని సర్కారు చెప్పుకుంటుంటే...ప్రతిపక్షాలు మాత్రం ప్రైవేట్ సంస్థల నుంచి కోట్ల రూపాయలు కమిషన్లు కొట్టేసేందుకే ఈ ప్లాన్ అని ఆరోపిస్తున్నాయి. ఇదంతా ఒకెత్తు అయితే సాక్ష్యాత్తూ టీఆర్ఎస్ పార్టీనే 24 గంటల విద్యుత్ సరఫరా విషయంలో క్రెడిట్ మొత్తం తెలంగాణ సీఎం కెసీఆర్ కే కట్టబెడుతుంది. కనీసం మాట మాత్రంగా అయినా ఆ శాఖ మంత్రి జగదీశ్వరరెడ్డి పేరు కూడా ప్రస్తావించటం లేదు. మంగళవారం నాడు టీఆర్ఎస్ ఎల్పీలో మీడియాతో మాట్లాడిన పల్లా రాజేశ్వర్ రెడ్డి కెసీఆర్ వల్లే ఇది సాధ్యం అయిందని ప్రకటించారు. విలేకరుల సమావేశం తర్వాత విడుదల చేసిన ప్రెస్ నోట్ లోనూ ఎక్కడా కనీసం మంత్రి పేరును కూడా ప్రస్తావించలేదు. ఇప్పటికే తెలంగాణ సీఎం కెసీఆర్ మంత్రులు నగరంలో ఉన్నా..కొన్ని సార్లు సమీక్షలకు కూడా పిలవటంలేదనే విమర్శలు ఉన్నాయి. టీఆర్ఎస్ నేతలు చెప్పేది ఎలా ఉంది అంటే..మంత్రి చేసిందేమీ లేదు..అంతా సీఎం కెసీఆరే చేశారన్న చందంగా చెప్పటం ద్వారా తమ మంత్రిని తామే అవమానించుకుంటున్నారు.
రైతులకు 24 గంటల విద్యుత్ విషయంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని పూర్తిగా విస్మరించి..ఇది అంతా ఒక్క సీఎం కెసీఆర్ మాత్రమే చేసినట్లు చెప్పుకోవటం వల్ల ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపటం ఖాయంగా కన్పిస్తోంది. ముఖ్యమంత్రి కెసీఆర్ తీసుకున్న సమర్థవంతమైన చర్యల వల్లే మూడున్నర సంవత్సరాల పసికూన తెలంగాణ చీకట్లను తరిమేసి వెలుగులు మిరుమిట్లు గొలిపే రాష్ట్రంగా కీర్తించబడుతున్నదని పల్లా రాజేశ్వరరెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ సరఫరాతో రైతులు, పారిశ్రామికవేత్తలతో సహా అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. కరెంట్ అడిగినందుకు కాల్చి చంపిన చరిత్ర టీడీపీదని..కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టి తెలంగాణను అంథకారం చేశారని ఆరోపించారు. రాష్ట్రాన్ని విభజిస్తే తెలంగాణ అంథకారం అవుతుందన్న కిరణ్ కుమార్ రెడ్డి మాటలు ఇంకా తెలంగాణ ప్రజల చెవుల్లో మోగుతూనే ఉన్నాయని వ్యాఖ్యానించారు.