Telugu Gateway
Cinema

‘సర్కార్ల’ సెన్సార్ పై సుప్రీంకు

‘సర్కార్ల’ సెన్సార్ పై సుప్రీంకు
X

పద్మావత్ వివాదం మళ్లీ మొదటికొచ్చింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఏకంగా రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి ‘సెన్సార్’కు పూనుకున్నాయి. అదీ ఏకంగా సినిమా మొత్తంపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించాయి. ఈ వ్యవహారం కొత్త చర్చకు దారితీస్తోంది. సినిమాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాల్సింది సెన్సార్ బోర్డు. కానీ రాష్ట్ర ప్రభుత్వాలే సినిమాలను నియంత్రించేందుకు రంగంలోకి దిగాయి. పద్మావతి సినిమా పేరును మార్చటంతోపాటు..కొన్ని మార్పులు చేయాలని సెన్సార్ బోర్డు సూచించటం..వాటిని చిత్ర యూనిట్ అంగీకరించటం జరిగిపోయింది. దీంతో సినిమా విడుదలకు మార్గం సుగమం అయినట్లే అని అందరూ భావించారు. కానీ ఏకంగా నాలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పద్మావత్ సినిమాను తమ తమ రాష్ట్రాల్లో విడుదలకు అంగీకరించబోమని ప్రకటించటం పెద్ద సంచలనంగా మారింది. షూటింగ్‌ మొదలు పెట్టిన దగ్గరనుంచీ ఈ సినిమా వివాదాలతోనే సాగుతుంది.

సెన్సార్‌బోర్డు అనుమతిచ్చినా.. అడ్డుకుంటామని కొంత మంది హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతోపాటు గుజరాత్‌, రాజస్తాన్‌, హర్యానా, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాలు.. చిత్ర విడుదలను నిలిపేస్తున్నట్లు ప్రకటించాయి. సినిమా విడుదలను రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డుకోవడంపై పద్మావత్‌ నిర్మాతలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఎన్నో కష్టాలనోర్చి రూపొందించిన ‘పద్మావత్‌’ చిత్రానికి న్యాయం చేయాలని కోరుతూ నిర్మాతలు సుప్రీం కోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. చిత్ర నిర్మాతల పిటీషన్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా.. గురువారం విచారణ జరిగే అవకాశం ఉన్నట్లు అంచనా. దీపికా పదుకొనే, రణ్‌వీర్ సింగ్, షాహిద్ కపూర్ ప్రధానపాత్రలలో సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కించిన 'పద్మావత్' జనవరి 25న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Next Story
Share it