పద్మావత్ సినిమాపై రాష్ట్రాల సెన్సార్ చెల్లదు
ఎట్టకేలకు పద్మావత్ సినిమా దేశ వ్యాప్తంగా విడుదలకు లైన్ క్లియర్ అయింది. రాష్ట్రాల్లో తలెత్తే శాంతి, భద్రతలను కాపాడాల్సిందే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిషేధించిన రాష్ట్రాల్లో కూడా విడుదల చేయాల్సిందేనని గురువారం తేల్చి చెప్పింది. సెన్సార్ సమస్యలను దాటి ఈ నెల 25న రిలీజ్‌కు రెడీ అవుతున్న క్రమంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు నిషేధం విధించిన విషయం తెలిసిందే. సెన్సార్ బోర్డ్ రిలీజ్ కు అనుమతించినా.. తాము మాత్రం అనుమతించబోమని ఆయా ప్రభుత్వాలు ప్రకటించాయి. దీంతో నిషేదంపై చిత్ర నిర్మాతలు సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
ఈ అంశాన్ని విచారణకు స్వీకరించిన చీఫ్ జస్టిస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ కారణంగా సినిమాను నిషేదించారంటూ రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం నాకు ఆశ్చర్యం కలిగించింది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఆరు రాష్ట్ర ప్రభుత్వాలు సినిమాపై విధించిన నిషేదాన్ని సస్పెండ్ చేస్తూ తీర్పు వెలువరించారు. ఈ సుప్రీం తీర‍్పుతో ఈ నెల 25న దేశవ్యాప్తంగా పద్మావత్ రిలీజ్‌కు లైన్ క్లియర్ అయ్యింది. అయితే సుప్రీం తీర్పుపై ఆయా ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో వేచిచూడాల్సిందే.