బార్ లో ‘ ఆ పదం’ వాడితే బయటకు వెళ్లగొడతారు
ఎవరైనా బార్ కు ఎందుకెళతారు. ఫుల్లుగా మందుకొట్టి తమకు తోచినట్లు మాట్లాడుకోవటానికి...కబుర్లు చెప్పుకోవటానికి. అక్కడ మాట్లాడే మాటలకు హద్దులు ఉండవు..ఆంక్షలు ఉండవు. కానీ ఓ చోట మాత్రం తమ బార్ లో ‘ఆ పదాన్ని’ ఉపయోగిస్తే ఊరుకునేదిలేదని..ఆ పదం ఉచ్చరించిన ఐదు నిమిషాల్లోనే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుందని ఏకంగా నోటీసు బోర్డు పెట్టేశారు. అంత చికాకు తెప్పించే ఆ ఇంగ్లీషు పదం ఏంటి అనుకుంటున్నారా?. ‘లిటరల్లీ’ అనే పదాన్ని తమ బార్ లో వాడొద్దని..ఇప్పటికే దీన్ని చాలా అతిగా వాడేశారని కాంటినెంటల్ బార్ యాజమాని ట్రిగ్గర్ స్మిత్ చెబుతున్నారు.
ఈ బార్ న్యూయార్క్ లోని ఈస్ట్ విలేజ్ లో ఉంటుంది. బార్ లో దీనికి సంబంధించి ఓ నోటీసు బోర్డు కూడా పెట్టేశారు. ఎవరైనా కాదు..కూడదు అని లిటరల్లీ పదాన్నిఉపయోగిస్తే ఆ వ్యక్తిని ఐదు నిమిషాల్లో బార్ నుంచి తీసుకెళ్లి బయటపడేస్తారు. ఆ లోగా తన డ్రింక్ ను కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. లిటరల్లీతో ఎవరైనా వాక్యాన్ని మొదలుపెడితే తక్షణమే బార్ నుంచి బయటకు తోసేస్తారు. బార్ లో ఈ పదం వాడితే బయటకు వెళ్లగొడతామని ఏకంగా నోటీసు పెట్టడం కామెడీగా ఉంది కదా?.