Telugu Gateway
Politics

మోత్కుపల్లి టార్గెట్ అదేనా?

మోత్కుపల్లి టార్గెట్ అదేనా?
X

తెలంగాణ తెలుగుదేశం సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఎన్టీఆర్ వర్థంతి వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబుపై పాత పగ తీర్చుకున్నారా?. అంటే అవుననే సమాధానం వస్తోంది టీడీపీ వర్గాల నుంచి. మోత్కుపల్లి ఎప్పటి నుంచో తనకు రాజ్యసభ సీటు ఇవ్వాలని చంద్రబాబును కోరుతున్నారు. అయితే చంద్రబాబు మాత్రం గవర్నర్ పదవి ఆశ చూపుతూ వచ్చారు. కానీ అది నెరవేరలేదు...భవిష్యత్ లోనూ నెరవెరేలా కన్పించటం లేదు కూడా. ఈ లోగానే మోత్కుపల్లికి ఎన్టీఆర్ వర్థంతి రూపంలో కాలం కలసి వచ్చింది. ఇదే వేదికగా ఎన్టీఆర్ వర్థంతికి కూడా చంద్రబాబు రాని అంశాన్ని లేవనెత్తి పార్టీ అధినేతను తీవ్ర ఇరకాటంలో పడేశారు. ఇది నిజంగా కూడా చంద్రబాబుకు ఇబ్బందికర పరిణామమే. ఇఫ్పటికే అవసరం ఉన్నప్పుడు తప్ప ఎన్టీఆర్ పేరు అందరూ మర్చిపోయేలా చేసి...పలు పథకాలకు ‘చంద్రన్న’ పేరుతో చంద్రబాబు తన జపం చేయించుతున్న సంగతి అందరూ చూస్తున్నదే.

చంద్రబాబు ప్రస్తుతం తన ఇమేజ్ పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారు తప్ప....ఎన్టీఆర్ పేరును పక్కన పెట్టారనే అభిప్రాయం పార్టీ వర్గాల్లోనే వ్యక్తం అవుతోంది. మోత్కుపల్లి నర్సింహులు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చంద్రబాబును ఇరకాటంలో పెట్టడం ఖాయం. అయితే తెలుగుదేశం శ్రేణులు ఎవరూ కూడా టీడీపీని టీఆర్ఎస్ లో విలీనం చేయాలనే ప్రతిపాదనను ఆమోదించరని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీని భూస్థాపితం చేయాలని చంద్రశేఖర్ రావు కంకణం కట్టుకుని పనిచేస్తుంటే...ఇప్పుడు మోత్కుపల్లి వంటి నేతలు టీడీపీని టీఆర్ఎస్ లో విలీనం చేయాలని ఎలా చెబుతారని టీ టీడీపీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. మోత్కుపల్లి చేసిన ఈ ప్రతిపాదనతో పార్టీని వీడిన రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే నిజం అని న‌మ్మే పరిస్థితి ఏర్పడటం ఖాయం అని చెబుతున్నారు. ఏది ఏమైనా త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో తనకు సీటు ఇవ్వాల్సిందేనని సంకేతం పంపటం కోసమే మోత్కుపల్లి ఈ ఝలక్ ఇచ్చారని నేతలు అంచనా వేస్తున్నారు. అయితే ఏపీ కోటాలో చంద్రబాబు మోత్కుపల్లికి అవకాశం ఇస్తారా.. లేదా?...మోత్కుపల్లి సంధించిన అస్త్రాలు ఫలిస్తాయా లేదా తేలాలంటే కొంత కాలం వేచిచూడాల్సిందే.

Next Story
Share it