Telugu Gateway
Andhra Pradesh

మోడీ పట్టించుకోని హెచ్1బీ వీసా సమస్య

పాక్ పై అమెరికా ఆంక్షలు విధించగానే భారత్ లో హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. ఇది సహజమే. ఎందుకంటే ఇదో బావోద్వేగ అంశం కాబట్టి. ఇక నుంచి పాక్ కు ఒక్క డాలర్ కూడా ఇవ్వబోమని ట్రంప్ ట్విట్టర్ వేదికగా చెప్పగానే అంతా హడావుడి. భారత ప్రభుత్వం కూడా ఇందులో తమ కృషి ఉందని క్లెయిం చేసుకోవటం ప్రారంభించింది. ఇది కూడా తప్పుకాదనుకుందాం. కానీ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భారత ఐటి పరిశ్రమపై ప్రతికూల ప్రభావం చూపే నిర్ణయాలు ఎన్నో తీసుకున్నారు. ఇంకా తీసుకుంటూనే ఉన్నారు. కానీ ఈ అంశాలను మోడీ ఇప్పటివరకూ ఎన్నడూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో చర్చించిన దాఖలాలు లేవని ఐటి వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భారతీయ ఐటి పరిశ్రమకు అమెరికా పెద్ద మార్కెట్. అంతే కాదు..భారతీయ ఐటి నిపుణులు కూడా ఎక్కువగా ఆధారపడింది అమెరికాపైనే. అమెరికా వరస పెట్టి పెడుతున్న ఆంక్షలు భారతీయ ఐటి రంగాన్ని..యువతను నిరాశకు గురిచేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ ప్రభావం ఖచ్చితంగా దేశీయంగా ప్రభావం చూపించటం ఖాయం.

కానీ భారత ప్రధాని మోడీ అత్యంత కీలకమైన ఈ విషయంపై దృష్టి సారించకపోవటంపై పరిశ్రమ వర్గాల్లో విస్మయం వ్యక్తం అవుతోంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో బాంబు పేల్చారు. ఇదే కనుక అమల్లోకి వస్తే భారతీయ ఐటి పరిశ్రమ, యువత మరింత కష్టాల్లో పడటం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అమెరికా తాజా ప్రతిపాదన ఏంటో ఓ సారి చూడండి...అమెరికా కొత్తగా హెచ్‌–1బీ వీసాల విధానంలో కొత్త సవరణను ప్రతిపాదిస్తోంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం హెచ్‌–1బీ వీసా ఉన్న వారు గ్రీన్‌ కార్డుకు దరఖాస్తు చేసుకున్న సందర్భాల్లో...ఒకవేళ గ్రీన్‌ కార్డు అప్లికేషన్‌ పరిశీలనలో ఉండగానే హెచ్‌–1బీ వీసా గడువు ముగిసిపోతే అప్పుడు గ్రీన్‌కార్డుపై నిర్ణయం వెలువడే వరకు వీసా గడువును పొడిగిస్తారు. ఇకపై ఈ విధానాన్ని కొనసాగించకూడదనీ, హెచ్‌–1బీ వీసా కలిగిన వారు గ్రీన్‌కార్డుకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ...గ్రీన్‌కార్డు మంజూరవడానికి ముందే వీసా గడువు పూర్తయితే అలాంటి వారిని స్వదేశాలకు పంపించేయాలని హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం ప్రతిపాదించింది. భారత ఐటీ కంపెనీలు ఏటా అధిక సంఖ్యలో హెచ్‌–1బీ వీసాలను సంపాదించి అమెరికాలో తమ కార్యకలాపాల కోసం ఇక్కడి నుంచే ఉద్యోగులను తరలిస్తుండటం తెలిసిందే. తాజా నిర్ణయం అమల్లోకి వస్తే అమెరికాలో పనిచేస్తున్న 5 లక్షల నుంచి ఏడున్నర లక్షల మంది భారతీయులపై ప్రభావం పడే అవకాశం ఉంది.

వారంతా గ్రీన్‌కార్డుకు దర ఖాస్తు చేసుకున్నా, వీసా గడువు ముగిసేలోపు అది మంజూరవ్వకపోతే సొంత దేశానికి తిరిగి రావాల్సి ఉంటుంది. ఇప్పటికే హెచ్‌–1బీ వీసాల జారీ, కొనసాగింపు నిబంధనలను ట్రంప్‌ యంత్రాంగం ఒక్కొక్కటిగా కఠినం చేస్తుండటం తెలిసిందే. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే గ్రీన్‌కార్డుకు దరఖాస్తు పెండింగ్‌లో ఉండగానే వీసా గడువు ముగిసిన విదేశీ ఉద్యోగులు అమెరికా విడిచి స్వదేశాలకు వెళ్లిపోవాల్సి ఉంటుంది. అలాంటి వారి సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. వారందరి ఉద్యోగాలూ ఖాళీ అవుతాయి కాబట్టి ఆ కొలువులు అమెరికా జాతీయులకే దక్కుతాయనేది ట్రంప్‌ ఆలోచనగా భావిస్తున్నారు. విదేశీయులు ‘కొల్లగొడుతున్న’ ఉద్యోగాలను మళ్లీ అమెరికన్లకే ఇప్పిస్తానంటూ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన ట్రంప్‌...ఆ మాటను నిలబెట్టుకునేందుకే మొదటి నుంచి హెచ్‌–1బీ వీసాలపై కఠిన వైఖరిని అవలంబిస్తున్నారని పలువురు విశ్లేషిస్తున్నారు. మరి ఈ విషయంలో అయినా భారత ప్రధాని మోడీ అమెరికాతో చర్చిస్తారో లేదో వేచిచూడాల్సిందే.

Next Story
Share it