పవన్ పై కోదండరాం సంచలన వ్యాఖ్యలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై టీ జెఏసీ ఛైర్మన్ కోదండరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పర్యటిస్తున్న పవన్ తెలంగాణ సర్కారుపై..కెసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ టూర్ పై మీడియా కోదండరాం స్పందన కోరగా...ఆయన గురించి మాట్లాడి తన స్థాయిని తగ్గించుకోలేనని కోదండరాం వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమకారులను పక్కకు నెట్టేసి ద్రోహులను తన దగ్గరకు చేర్చుకున్న ప్రభుత్వం గురించి ప్రజలకు అర్థమైందని చెప్పారు. ప్రాంతీయ వనరులను సమకూర్చుకుని అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో తెలంగాణ తెచ్చుకున్నామని, కానీ కేసీఆర్ ప్రభుత్వ చర్యలు మాత్రం ఆంధ్రా వాళ్లకు లాభం చేసేలా ఉన్నాయని విమర్శించారు.
తెలంగాణలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా టీజేఏసీ భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేస్తోందని స్పష్టం చేశారు. ప్రతి జిల్లాలో నియోజకవర్గానికి రెండు గ్రామాల చొప్పున ఎంపిక చేసి రైతు సమస్యలపై అధ్యయనం చేశామని, జిల్లాల్లో సేకరించిన సమాచారాన్నంతా ఈ నెల (జనవరి) 31 లోగా క్రోడీకరిస్తామని తెలిపారు. ఫిబ్రవరి 4న హైదరాబాద్‌లో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి కార్యాచరణను రూపొందిస్తామని కోదండరాం వెల్లడించారు.