Telugu Gateway
Top Stories

ఏపీలో కాపు రిజర్వేషన్లు అటకెక్కినట్లే!

ఏపీలో కాపు రిజర్వేషన్లు అటకెక్కినట్లే!
X

మనం ఎవరికైనా ఓ లక్ష రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చామంటే మన దగ్గర ఆ మాత్రం మిగులు ఉండేలా ఆదాయం ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ హామీని నిలబెట్టుకోగలం. లేదంటే అది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాపులకు రిజర్వేషన్లు హామీ ఇచ్చినట్లే ఉంటుంది. మనం ఎవరికైతే హామీ ఇచ్చామో వాళ్ళకు మాత్రం కన్పించినప్పుడల్లా లక్ష రూపాయలు ఇస్తామని చెబుతూనే ఉంటాం. కానీ అది మాత్రం నెరవేరదు. కాకపోతే ఈ హామీ విషయంలో తాను ఏ మాత్రం వెనక్కితగ్గేదిలేదని ఓ బోగస్ ‘భరోసా’ కల్పిస్తాం. అంతే కదా..పోయేది ఏముంది. ఎన్నికల ముందు ఏపీ ప్రజల సాక్షిగా అప్పట్లో నరేంద్రమోడీ బహిరంగ సభల్లో ఇచ్చిన ప్రత్యేక హోదా..రైల్వే జోన్ వంటి హామీలే కాదు..హోదా బదులు ప్యాకేజీ అంటూ ఇచ్చిన హామీ కూడా అమలుకు నోచుకోలేదు. మరి అలాంటిది టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాపులకు ఇచ్చిన రిజర్వేషన్ల హామీని అమలు చేసే బాధ్యత ప్రధాని మోడీ తీసుకుంటారా?. అంటే ఖచ్చితంగా నో ఛాన్స్ అనే చెప్పొచ్చు.

దాదాపు ఏడాదిన్నర తర్వాత ఢిల్లీలో ప్రధాని మోడీతో భేటీ అయిన సందర్భంలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాపు రిజర్వేషన్ల అంశాన్ని ప్రధానితో ప్రస్తావించలేదు కూడా. అంటే ఇది అమలు ఏ మాత్రం సాధ్యమయ్యే అంశం కాదని తేలిపోతోంది. అంతే కాదు..గుజరాత్ ఎన్నికల సమయంలో 50 శాతం దాటి రిజర్వేషన్లు ఎవరు ఇస్తామని చెప్పినా నమ్మోద్దని..అది ఆయా వర్గాలను మోసం చేయటానికే అని మోడీ ప్రకటించారు. దేశంలోనే తనను మించిన సీనియర్ లేరని చెప్పుకునే చంద్రబాబుకు కాపులకు రిజర్వేషన్లు అమలు చేయటం సాధ్యంకాదని తెలియదా?. మేనిఫెస్టోలో ఏమైనా కేంద్రం ఒఫ్పుకుంటేనే ఇస్తామని ప్రకటించారా? అంటే అదీ లేదు.

స్పష్టంగా తాము అధికారంలోకి వస్తే కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇఛ్చారు. బీసీ కమిషన్ ఛైర్మన్ ను పట్టిచుంకోకుండా కేవలం సభ్యుల దగ్గర నుంచి నివేదిక తెప్పించుకుని అసెంబ్లీలో బిల్లు పెట్టి మమ అన్పించుకున్నారు. ఇప్పుడు ఇక తమ పాత్ర ఏమీలేదని..బిల్లు కేంద్రానికి పంపాం కాబట్టి...కేంద్రం నిర్ణయం కోసమే ఎదురుచూడటమే అని చెప్పి తప్పించుకోవటానికి చంద్రబాబు మార్గం సుగమం చేసుకున్నారు. నిజానికి చంద్రబాబుకు ఈ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంటే ప్రధానిని కలసిన సమయంలో ఎందుకు ఈ అంశంపై గట్టిగా ప్రశ్నించలేకపోయారన్నదే కీలకాంశం.

Next Story
Share it