Telugu Gateway
Politics

పవన్ కంటే చిరంజీవే బెటరా?

పవన్ కంటే చిరంజీవే బెటరా?
X

తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్. మెగా స్టార్ చిరంజీవి పార్టీ పెట్టి..పోటీ చేసి ఆ తర్వాత ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ విలీనం చేశారు. అదేమి విచిత్రమే కానీ పార్టీ పెట్టినప్పటి నుంచి పవన్ తీరు విచిత్రంగానే ఉంది. నాలుగేళ్ళ క్రితమే పార్టీ పెట్టి..ఆ ఎన్నికల్లో అసలు బరిలోకే దిగకుండా ..పక్క పార్టీలకు మద్దతు ఇఛ్చింది. పార్టీ పెట్టిన వెంటనే ఎవరైనా అదే ఊపులో బరిలోకి దిగాలని కోరుకుంటారు. కానీ పవన్ అలా కాదు..పార్టీ పెట్టిన వెంటనే పక్క పార్టీలకు మద్దతు ఇఛ్చిన పార్టీ అధ్యక్షుడిగా పవన్ అప్పుడే ఓ రికార్డు నెలకొల్పారు. 2014 మార్చి 14న పవన్ ఈ జనసేనను ప్రారంభించారు. మోడీ..చంద్రబాబులకు మద్దతిచ్చి నాలుగేళ్ళు అయిన తర్వాత కూడా పవన్ పోటీ విషయంలో క్లారిటీ లేకుండా..ఏపీలో చంద్రబాబు సర్కారుకు, తెలంగాణలో కెసీఆర్ సర్కారుకు పరోక్ష మద్దతు అందిస్తున్నారు. నిజంగా పవన్ కు ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీలకు మేలు చేయాలనే ఉద్దేశం లేకపోతే...రెండు రాష్ట్రాల్లోనూ మంచి పేరున్న అభ్యర్థులను ఎంపిక చేసి..వారిని ఇఫ్పటి నుంచే ఎన్నికలకు సిద్ధం చేయవచ్చు. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల బలానికి తోడు పవన్ కళ్యాణ్ సినీ గ్లామర్ కూడా దానికి పనికి వస్తుంది.

ప్రస్తుత డిజిటల్ యుగంలో ఏ జిల్లాలో ఎవరికి ఎలాంటి పేరుంది..వారు ఎన్నికల బరిలో నిలిస్తే ఎలాంటి ఫలితాలు రాబట్టగలరు అనేది తెలుసుకోవటం పెద్ద కష్టం కానే కాదు. ఇవన్నీ వదిలేసి తాను అభిమానులకు సీట్లు ఇవ్వను అని...ఎన్ని సీట్లలో పోటీచేసేది రెండు నెలల ముందు క్లారిటీ వస్తుంది అని చెప్పటం ద్వారా ‘పవన్ ఏజెండా’ ఏంటి అనేది స్పష్టంగా తెలిసిపోతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ వ్యవహారం అంతా చూస్తుంటే పవన్ కంటే చిరంజీవే బెటర్ అనే వ్యాఖ్యలూ రాజకీయ వర్గాల్లో విన్పిస్తున్నాయి. ప్రజారాజ్యం ఉమ్మడి రాష్ట్రంలో 294 నియోజకవర్గాల్లో పోటీచేసినా మొత్తం 18 సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ పార్టీ అలాగే కొనసాగి ఉండి పరిస్థితి మరోలా ఉండేది. కానీ చిరంజీవి పార్టీ నిర్వహణ తనకు సాధ్యంకాదని భావించి..కాంగ్రెస్ లో విలీనం చేసి..రాజ్యసభతో పాటు కేంద్ర మంత్రి పదవిని దక్కించుకున్నారు.

అది చిరంజీవి అయినా..పవన్ కళ్యాణ్ అయినా కొత్త పార్టీ పెట్టారంటే రాజకీయాల్లోకి కొత్త రక్తం వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకూ పాతుకుపోయిన పార్టీల నుంచే కాకుండా కొత్త వారు కూడా రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశం ఏర్పడుతుంది. కానీ పవన్ ఆ దిశగా పయనిస్తున్నట్లు ఏ మాత్రం కన్పించటం లేదు. పవన్ కళ్యాణ్ కు రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది అభిమానులు ఉన్నా...ఆ శక్తిని అంతా ఎవరి కోసమే త్యాగం చేస్తున్నట్లు కన్పిస్తుంది. చిరంజీవి అయినా ఫీల్డ్ టెస్ట్ చేసి వదిలేశారు..కానీ పవన్ మాత్రం టెస్ట్ కు ముందే వదిలేస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. జనసేన పోటీ పరిమితం అని పవన్ చెప్పుకుంటూ పోతే...సీట్లు వస్తాయో రావో తెలియని పార్టీతో కలసి ముందుకు సాగేందుకు ఎవరు మాత్రం ముందుకు వస్తారు. వస్తే గిస్తే ఎక్కడా సీట్లు రాని వారు తప్ప.

Next Story
Share it