Telugu Gateway
Andhra Pradesh

చినరాజప్ప సిఫారసు..అవినీతి అధికారికి అందలం

చినరాజప్ప సిఫారసు..అవినీతి అధికారికి అందలం
X

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి సుపరిపాలనకు ఇదో మచ్చుతునక. అసలు అవినీతిని సహించేదిలేదని నిత్యం బీరాలు పలికే సీఎం తమ ప్రభుత్వంలో తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొని పక్కన పెట్టిన వ్యక్తికి ఇప్పుడు కీలక పదవి కట్టబెట్టారు. ఈ వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వర్గాల్లో కలకలం రేపుతోంది. అదేంటో మీరూ చూడండి. కొద్ది కాలం క్రితం వరకూ కాపు కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ గా ఉన్న అమరేంద్రకుమార్ పై తీవ్ర అవినీతి ఆరోపణలు వచ్చాయి. కార్పొరేషన్ నిధులను తన ఇష్టానుసారం వాడుకున్నట్లు ఆరోపణలు రావటంతో ఆయన్ను అక్కడ నుంచి తప్పించారు. అమరేంద్రకుమర్ వ్యవహారశైలి కూడా కార్పొరేషన్ ఎండీగా ఉన్న సమయంలో అభ్యంతరకరంగా ఉందనే విమర్శలు వెల్లువెత్తాయి. అలాంటి అధికారికి ఇప్పుడు సర్కారు ఏకంగా గోదావరి అర్భన్ డెవలప్ మెంట్ అథారిటీ (జీయుడీఏ) వైస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ పోస్టు కట్టబెట్టారు.

అమరేంద్రకుమార్ కు ఈ పోస్టు ఇవ్వాల్సిందిగా ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి చినరాజప్ప సిఫారసు లేఖ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీని వెనక ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న ఇద్దరు మంత్రులు తెరవెనక ఉండి నడిపించగా..లేఖ ఇవ్వటం ద్వారా హోం మంత్రి చినరాజప్ప ఇరుక్కున్నారని చెబుతున్నారు. ఈ ఆథారిటీ పరిధిలో రాజమండ్రి, కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్లతోపాటు..పలు మునిసిపాలిటీలు కూడా ఉన్నాయి. వాస్తవానికి ఇది ఐఏఎస్ అధికారులకు ఇవ్వాల్సిన పోస్టు అని..దీన్ని ఇప్పుడు పశుగణాభివృద్ది శాఖ జాయింట్ డైరక్టర్ కు అప్పగించటంపై మునిసిపల్ శాఖ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. భవిష్యత్ లో ఈ ప్రాంతంపై తమ పట్టుపెంచుకునేందుకు ఇద్దరు మంత్రులు పావులు కదపగా..అందులో హోం మంత్రి చినరాజప్ప కూడా భాగస్వామిగా మారారని చెబుతున్నారు.

Next Story
Share it