Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబుకు ‘బ్రాండ్ అంబాసిడర్ల’ గండం

చంద్రబాబుకు ‘బ్రాండ్ అంబాసిడర్ల’ గండం
X

‘ఏపీకి నేనే పెద్ద బ్రాండ్ అంబాసిడర్. కొత్తగా దీని కోసం ఎవరిని నియమించాల్సిన అవసరం లేదు.’ ఇదీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి తీరు. అలా అన్న చంద్రబాబు కొత్తగా బ్రాండ్ అంబాసిడర్ల గురించి ప్రకటనలు చేయకుండా ఉంటే పోయేది. కానీ చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ల గురించి ప్రకటించిన ప్రతిసారి ఈ హోదా దక్కించుకున్న వారందరూ తీవ్ర వివాదాలు పాలు అవుతున్నారు. కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ నటులు అజయ్ దేవ్ గన్, కాజల్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. వాళ్ళు ఏదో ప్రాజెక్టు పని మీద వచ్చారు. అంతే ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలువడింది. దాని సారాంశం ఏంటి అంటే ఏపీ పర్యాటక బ్రాండ్ అంబాసిడర్లుగా బాలీవుడ్ జంట అజయ్ దేవగన్, కాజల్ లు వ్యవహరిస్తారని ప్రకటించారు. ఈ ప్రకటనపై అప్పట్లోనే విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఇది జరిగిన కొద్ది రోజులకే అజయ్ దేవ్ గన్ పేరు ‘పనామా’ పత్రాల్లో బయటపడింది. విదేశాల్లో నల్లధనం దాచినవారిలో అజయ్ దేవగన్ కూడా ఉన్నట్లు వీటి సారాంశం. అంతే..ఏపీ ప్రతిపాదన అటకెక్కింది. ఇది ఒక్కటే అనుకుంటే పొరపాటే.

గత ఏడాది సెప్టెంబర్ 12న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విశాఖపట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో నటి పూనమ్ కౌర్ ను ఏపీ చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా నియమించనున్నట్లు ప్రకటించారు. పరిశ్రమలో ఏ మాత్రం గుర్తింపులేని పూనమ్ కౌర్ ను ఏపీ చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా నియమించటం ఏమిటనే విమర్శలు విన్పించాయి. తాజాగా సినీ విమర్శకుడు కత్తి మహేష్ అసలు విషయాన్ని బహిర్గతం చేశారు. జనసేన అధినేత, హీరో పవన్ కళ్యాణ్ సిఫారసులతోనే ఏపీ ప్రభుత్వం పూనమ్ కౌర్ ను చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా నియమించిందని ఆరోపించారు. ఇలా చంద్రబాబు ఎవరిని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించినా వారు వివాదాల్లో కూరుకపోతున్నారు. పూనమ్ కౌర్ చాలా సినిమాల్లో హీరోయిన్ల పక్కన సపోర్టింగ్ రోల్స్ చేసిందే తప్ప..పరిశ్రమలో పెద్దగా రాణించింది కూడా లేదు. మరి ఇలాంటి నటిని నిత్యం హంగామా కోరుకునే చంద్రబాబు ఏపీ చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారంటే..ఇందులో ఖచ్చితంగా సిఫారసులు పనిచేసి ఉంటాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. స్వచ్చ ఆంధ్ర బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకన్న గజల్ శ్రీనివాస్ ఏకంగా ఓ సెక్స్ కేసులో ఇరుక్కున్నారు. ఇప్పుడు ఏకంగా జైలులో ఉండటంతో ఆయన్ను ఏపీ ప్రభుత్వం స్వచ్చ ఆంధ్ర బ్రాండ్ అంబాసిడర్ పదవి నుంచి తప్పిస్తూ ఆదేశాలు జారీ చేసింంది ఈ మధ్యే. ఇలా బ్రాండ్ అంబాసిడర్ అన్న పేరెత్తితే చాలు చంద్రబాబుకు ే ఏదో ఒక రూపంలో గండం ముంచుకొస్తోంది.

Next Story
Share it