Telugu Gateway
Andhra Pradesh

‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లోకి చంద్రబాబు!

‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లోకి చంద్రబాబు!
X

ఎందుకు అనుకుంటున్నారా?. దానికి పెద్ద కథే ఉంది మరి. సహజంగా దేశంలో ఎవరికి తెలిసి అయినా ఎంత ప్రతిష్టాత్మక..గొప్ప ప్రాజెక్టుకు అయినా శంకుస్థాపన...అది పూర్తి అయిన తర్వాత జాతికి అంకితం ఉంటాయి. ఎవరైననా ఈ రెండు కార్యక్రమాలే చేస్తారు. కానీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నిటిలాగే ఈ చరిత్రను తిరగరాస్తున్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని రీతిలో ‘రికార్డు’ శంకుస్థాపనలు చేస్తున్నారు. అదీ ఒకే ప్రాజెక్టుకు. పోలవరం పనులు మాత్రం అనుకున్నంత వేగంగా జరగటం లేదు కానీ..చంద్రబాబు శంకుస్థాపనలు చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. ఒక్క చంద్రబాబునాయుడే పోలవరానికి సంబంధించి నాలుగు సార్లు శంకుస్థాపన చేశారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. ఆయన అధికారంలోకి వచ్చాక తొలిసారి 2016 డిసెంబర్ 29న కాంక్రీట్ పనులకు శంకుస్థాపన చేశారు. తర్వాత 2017 జనవరి 12న గేట్ల పనులకు శంకుస్థాపన చేశారు. 2017 జూన్ 8న ఎగువ కాఫర్ డ్యామ్ పనులకు శంకుస్థాపన చేశారు. మళ్ళీ జనవరి 8, 2018న మరోసారి కాఫర్ డ్యామ్ పనులకు శ్రీకారం చుట్టారు. నిజంగా ఏదైనా కొత్త విభాగంలో పనులు ప్రారంభిస్తుంటే ఇంజనీర్లో..లేక కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధి ఎవరో ఒకరు ఓ కొబ్బరికాయ కొట్టి పనులు మొదలుపెట్టుకుంటారు. అంతే కానీ ఓ ముఖ్యమంత్రి తన స్థాయిలో ఒకే ప్రాజెక్టుకు నాలుగుసార్లు శంకుస్థాపన చేయటం విశేషం.

అంటే ఎంతసేపు ప్రచారయావ ..హంగామా తప్ప..పనులపై శ్రద్ధ లేదనే విషయం ఈ ఘటనలన్నీ చెప్పకనే చెబుతున్నాయి. పోలవరం ఒక్కదాంట్లోనే ఇలా జరిగింది అనుకుంటే పొరపాటే. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపనల విషయంలోనూ ఇదే తంతు జరిగింది. ఓ సారి ఫ్యామిలీ ఫంక్షన్ గా చంద్రబాబునాయడు అండ్ ఫ్యామిలీ అమరావతి శంకుస్థాపన చేసేశారు. తర్వాత ప్రధాని నరేంద్రమోడీ వచ్చారు...శంకుస్థాపన చేశారు. మళ్ళీ మధ్యలో పరిపాలనా భవనాలకు అంటూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో శంకుస్థాపన చేయించారు. ఈ మధ్యే మరోసారి శంకుస్థాపన అనుకుని..డిజైన్లు రాలేదని ఆగిపోయారు. లేదంటే ఇంకోమారు కూడా శంకుస్థాపన పూర్తయ్యేది. ఇలా ఒకే పనికి పలుమార్లు శంకుస్థాపన చేస్తున్న చంద్రబాబుకు ‘గిన్నిస్ బుక్ ఆప్ వరల్డ్ రికార్డ్స్’లో నమోదుకు అర్హతలేదని ఎవరైనా అంటారా?.నో ఛాన్స్. ఆయనకు ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఆ గుర్తింపు వచ్చి తీరుతుంది!.

Next Story
Share it