చంద్రబాబు బరితెగింపు పరాకాష్టకు
కాంట్రాక్ట్ ల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బరితెగింపు ‘పీక్ ’కు వెళ్లింది. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ శనివారం నాడు తీసుకున్న నిర్ణయం చూసి అధికారులు సైతం షాక్ కు గురయ్యారు. చంద్రబాబు తాను కోరుకున్నట్లు జీఎంఆర్ సంస్థకు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టు దక్కకపోవటంతో ఏకంగా ఆ టెండర్ నే రద్దు చేసి మళ్లీ టెండర్లు పిలవాలని నిర్ణయించారు. తొలుత ఈ టెండర్ దక్కించుకున్నది ఎవరో తెలుసా?. సాక్ష్యాత్తూ ఏపీకి చెందిన టీడీపీ సీనియర్ నేత, కేంద్ర పౌరవిమానయాన శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న అశోక్ గజపతిరాజు శాఖకు చెందిన ఎయిర్ పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ)కి కావటం విశేషం. మరి అశోక్ గజపతిరాజు తన శాఖకు చెందిన ఏఏఐకి దక్కిన తొలి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ ప్రాజెక్టు విషయంలో జరిగిన అన్యాయాన్ని చూస్తూ మౌనంగా ఊరుకుంటారా? లేక స్పందిస్తారా? అన్నది వేచిచూడాల్సిందే. ఏపీలో ఇంత వరకూ అసలు గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయమే లేదు. అలాంటిది ప్రాజెక్టు దక్కించుకున్న ప్రభుత్వ రంగ సంస్థ ఏఏఐకి ప్రాజెక్టు అప్పగించి..వేగంగా పనులు పూర్తి చేయించాల్సిన సర్కారు ప్రభుత్వ రంగ సంస్థ దక్కించుకున్న టెండర్ ను రద్దు చేయటం ఏమిటి?. అంటే అంత అసంపూర్తిగా..అసమగ్రంగా మౌలికసదుపాయాల శాఖ అసలు టెండర్ ఎలా పిలిచింది. ఇంత కసరత్తు చేసిన తర్వాత టెండర్ రద్దు చేయటంలో హేతుబద్దత ఏముంది?. జీఎంఆర్ కంటే ఏఏఐ ఏపీ ప్రభుత్వానికి ఇస్తానన్న ఆఫర్ చాలా ఎక్కువగా ఉంది.
ఈ ప్రాజెక్టు దక్కించుకున్న ఏఏఐ 31 శాతం రెవెన్యూ ఇస్తానని ప్రకటించగా...చంద్రబాబు ప్రాజెక్టు ఇవ్వాలని అనుకున్న జీఎంఆర్ 21.6 శాతం మాత్రమే ఆఫర్ చేసింది. అంతే చంద్రబాబు అప్పటినుంచో ఏఏఐని ఎలా తప్పించాలా? అని చూసి..ఇప్పుడు కొత్తగా అదనపు కాంపొనెంట్స్ చేర్చి టెండర్ పిలవాలని నిర్ణయించటం వెనక కుట్ర ఊహించదగిందే. అంటే మొదట టెండర్లు పిలిచిన సమయంలో ఈ ఆలోచన ఎందుకు లేకపోయింది అన్న ప్రశ్నలకు చంద్రబాబు సర్కార్ సమాధానం చెప్పగలదా?. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే. ఏఏఐ నుంచి అయితే కమిషన్ల రూపంలో రూపాయి కూడా రాదు. అదే ప్రైవేట్ సంస్థలు అయితే భారీ ఎత్తున ముట్టచెబుతాయి. అదే అసలు ప్లాన్ అని అధికార వర్గాలు కూడా వ్యాఖ్యానిస్తున్నాయి.