మరి కెసీఆర్ పై కూడా కేసు పెడతారా?
సోషల్ మీడియాలో వ్యాఖ్యలు శృతి మించుతున్నాయి. నిజమే. రాజకీయ నేతలు కూడా చాలాసార్లు హద్దులు దాటుతున్నారు. అందులో ఏ మాత్రం సందేహం లేదు. అయితే ఇది కొత్తగా వచ్చింది ఏమీ కాదు. నిజమే...తప్పు ఎవరు చేసినా శిక్షించాల్సిందే. ఇదే సూత్రం ముఖ్యమంత్రి కెసీఆర్ కు కూడా వర్తిస్తుందా?. కొద్ది రోజుల క్రితమే విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి కెసీఆర్ కారణం ఏదైనా ప్రొఫెసర్ కోదండరాంను వాడు..వీడు అని పలుమార్లు దూషించారు. అంతే కాదు..కమ్యూనిస్టులను అయితే నా కొడుకులు అని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో ఎవరైనా పరుషంగా మాట్లాడితే చాలు ముఖ్యమంత్రి కెసీఆర్, మంత్రులు లేచి కొత్త రాష్ట్రం విలువలు, సంప్రదాయాలు అంటూ మాట్లాడతారు. మరి ముఖ్యమంత్రి కెసీఆర్,మంత్రులు ప్రత్యర్థి పార్టీల నాయకులను ఇష్టానుసారం పనికిమాలిన వాళ్లు అనే మాటతో పాటు పలు పరుష వ్యాఖ్యలు చేసిన సందర్బాలు ఎన్నో. తాము ఎవరినైనా అనొచ్చు..తమని మాత్రం ఎవరూ ఏమీ అనకూడదనే వైఖరి అధికార పార్టీలో కన్పిస్తోంది. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ముఖ్యమంత్రి, మంత్రులే పలుమార్లు కట్టుతప్పిన సందర్భాలు ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు ఎవరైనా నోరెత్తితే కేసులు పెడతాం అని బెదిరిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం అవినీతి ఆరోపణ చేసిన వారే నిరూపించాలి. లేదంటే జైలు వెళ్లాల్సి ఉంటుంది. దీని కోసమే ప్రత్యేక చట్టం ‘ప్రూవ్ ఆర్ పెరిష్’ తెస్తున్నాం అని కెసీఆర్ ప్రకటించారు.
అయినా పలు పార్టీలు చేతనైతే కేసులు పెట్టుకోండి అని సవాళ్ళు విరిరాయి. అంతే కాదు పక్కా ఆధారాలు ఉన్నాయి అంటూ కూడా బహిరంగ సవాళ్లే విసిరారు. కానీ సర్కారు మాత్రం ఈ విషయంలో పూర్తిగా వెనక్కి తగ్గింది. అంటే ప్రతిపక్షాలు చేస్తున్న అవినీతి ఆరోపణల్లో ఎంతో కొంత నిజం ఉందని ప్రజలు నమ్మే పరిస్థితి ఏర్పడింది. ఫ్రూవ్ ఆర్ పెరిష్ చట్టం విఫలం కావటంతో ప్రతిపక్షాలతో పాటు ఇతరుల నోళ్ళకు కళ్ళేం వేసేందుకే ప్రభుత్వం ఈ కొత్త ఎత్తుగడ వేసినట్లు కన్పిస్తోంది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి కెసీఆర్ ఇప్పుడు కొత్తగా సోషల్ మీడియాతోపాటు బయట కూడా ఎవరైనా దూషిస్తే శిక్షించేలా ఐపీసీ చట్టంలో మార్పులు చేసే ఫైలుపై సంతకాలు పెట్టినట్లు వార్తలు వచ్చాయి. అదీ రిప్లబిక్ డే రోజు. ఈ చట్టం అమల్లోకి వస్తే ఎవరైనా పరుషంగా మాట్లాడితే వాళ్ళను ఇక జైల్లో పెట్టొచ్చన్న మాట. అయితే ఇది ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్లకే వర్తిస్తుందా? లేక అందరికీనా అన్నది వేచిచూడాల్సిందే.